నైరుతి రుతుపనాల ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో కనబడుతోంది. శనివారం రాత్రి నుంచి రెండు రాష్ట్రాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెంచికలపాడు వద్ద వక్కలేరు వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నందవరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోకి వరద నీరు ప్రవేశించింది. పెద్దకొత్తిలిలో పంట పొలాలు నీట మునిగాయి. కోడుమూరు మండలం వర్కూరు వద్ద తుమ్మలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మార్గమధ్యలో ఓ లారీ డ్రైవర్ వాగులో చిక్కుకుపోయాడు. అతనిని స్థానికులు కాపాడారు.