ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, చెరువులు, వంకలు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలియజేసింది. సముద్రంలోనూ అలల తీవ్రత పెరిగే అవకాశమున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
కృష్ణా జిల్లాలో...
విజయవాడలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన కూడళ్లయిన బెంజ్ సర్కిల్, ఆటోనగర్, బీసెంట్ రోడ్లో వర్షపు నీటితో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుుతున్నారు. బెంజ్ సర్కిల్‌లో భారీగా నీరు నిలిచిపోవటంతో, మున్సిపల్ అధికారులు ప్రత్యేక వాహనాలతో ఈ నీటిని తోడేస్తున్నారు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న డ్రైనేజీ కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవటంతోనే ఈ సమస్య తలెతోందని వాహనదారులు వాపోతున్నారు.
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వీరులపాడు మండలం కట్టలేరు వైరా వాగు, కట్టలేరు కలిసి ఉగ్రరూపం దాల్చుతున్నాయి. వరద నీరు కాజ్‌వే మీదగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులోకి ఎవ్వరూ వెళ్లకుండా ఎస్సై సోమేశ్వరరావు పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. కంచికచర్ల ఆర్టీసీ బస్టాండ్లో మూడు అడుగుల మేర వరద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.