Godavari water flow: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తింది. ధవళేశ్వరం వద్ద నదిలోకి నీటి ప్రవాహం భారీగా పెరిగింది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భారీ వరదతో బ్యారేజీకి దిగువనున్న లంక గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గోదావరి ఉద్ధృతితో కోనసీమ జిల్లాలోని చాకలిపాలెం సమీపంలో కనకాయలంక వద్ద కాజు వే ముంపునకు గురైంది. గ్రామ ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. బూరుగులంక, అరిగెలవారి పేట, ఉడుముడి లంక, జి.పెదపూడి లంక , అయోధ్య లంక, ఆనగారిలంక , పెదమల్లంకకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపై ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
ముమ్మిడివరం, ఐ పోలవరం మండలాల్లో గోదావరి పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముమ్మిడివరం పరిధిలోని లంకా ఆఫ్ ఠాన్నే లంక, పల్లం వారిపాలెం గ్రామాల్లో మెట్ట పంటలు నీటి మునిగాయి. మునగ, గోంగూర, బీర, అరటి తోటలు ముంపు బారిన పడ్డాయి. కొబ్బరి తోటలోని కాయలు కొట్టుకుపోకుండా రైతులు గట్టుకు చేరుస్తున్నారు. ఐ.పోలవరం మండలం ఎదురులంకలో వరదకు కొబ్బరి చెట్లు పడిపోతున్నాయి.కాకినాడ జిల్లాపైనా వరద ప్రభావం పడింది. పలుచోట్ల వాగుల ఉద్ధృతి పెరిగింది. యానాంలో రాజీవ్ గాంధీ బీచ్‌కు అనుకుని ఉన్న కాలనీలోకి వరద నీరు చేరింది. అధికారులు మోటార్లతో నీటిని తోడుతున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి జలాశయం గట్టు ప్రమాదకరంగా మారింది. వర్షాలకు భారీగా వరద నీరు జలాశయంలోకి చేరుతోంది. ఎగువ నుంచి 5 వేల 654క్యూసెక్‌ల వరద ప్రాజెక్ట్ లోకి వస్తోంది. రెండు గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు వదలుతున్నారు. అయితే.. స్పిల్ వే గేట్ల కుడివైపు గట్టు ప్రమాదకరంగా మారింది. ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలతో క్రమంగా కోతకు గురవుతోంది. అధికారులు ప్రస్తుతం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. గట్టు కోతకు గురవడంపై స్థానికులు కలవరపడుతున్నారు. వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.