తౌక్టే తుపాను ఏపీపైనా ప్రభావం చూపుతోంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం తక్కువ ఎత్తులో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరువర్షాలు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం నమోదైంది. పలుచోట్ల గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పశ్చిమగోదావరిలో కురిసిన వర్షానికి అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలూరు సమీపంలోని పలు గ్రామాల్లో.. రైతులు ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు లేకపోవటంతో గోడౌన్లలో దాచుకోలేక.. కళ్లాల్లో ఉంచిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ప్రభుత్వం తమ కష్టం అర్థం చేసుకుని వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. తడిసిన ధాన్యం బస్తాలతో రైతులు ధర్నా నిర్వహించారు. 40 శాతం పంట కళ్లాల్లోనే ఉండిపోయిందని.. కౌలు రైతుల వద్ద నుంచీ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.