తెలంగాణ

telangana

ETV Bharat / city

చేతికొచ్చిన పంట.. నీటి పాలు!

రాష్ట్రంలో గురువారం నాడు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చేతికొచ్చిన పంట పొలంలోనే రాలి, నానుతోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్​కు అంతరాయం కలిగింది. హైదరాబాద్​లో రహదారులు జలమయమయ్యాయి.

rain in telangana
చేతికొచ్చిన పంట.. నీటి పాలు!

By

Published : Apr 10, 2020, 5:57 AM IST

రాష్ట్రంలో ఈదురు గాలులతో కురుస్తున్న వడగండ్ల వర్షాలకు చేతికొచ్చిన వరి పంట రాలిపోతోంది. మడుల్లోనే ధాన్యం నానుతోంది. గురువారం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లతో కురిసిన వర్షానికి ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం, మిరప, మొక్కజొన్న పంట ఉత్పత్తులు నానిపోయాయి. యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో పలుచోట్ల, ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల, మహాముత్తారం, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మంగపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది.

చేతికొచ్చిన పంట.. నీటి పాలు!

చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. అక్కడక్కడ కల్లాల్లో ఉన్న మిర్చి పంట కూడా తడిసింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట, నల్గొండ జిల్లా దేవరకొండలో మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ జిల్లాల్లో కోతలకు వచ్చిన వరి కంకులు నేలమట్టమయ్యాయి. దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై పిడుగు పడడంతో స్వల్పంగా పెచ్చులూడాయి. హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయ్యాయి.

చేతికొచ్చిన పంట.. నీటి పాలు!

పదరలో 45.5 మిల్లీమీటర్ల వర్షం

గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా పదరలో గరిష్ఠంగా 45.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో 36.4 మి.మీ., మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్‌ మండలం బొల్లారంలో 33.5 మిల్లీమీటర్లు, నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలో 31.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

నేడు, రేపు ఈదురుగాలులు

రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details