Telangana Rains Today: బంగ్లాదేశ్ నుంచి ఝార్ఖండ్ వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఝార్ఖండ్‌పై ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ, నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులోకి గాలులు వీస్తున్నాయంది. వీటి ప్రభావంతో జంటనగరాల్లో ఆదివారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. వర్షం వల్ల ఇవాళ ఉదయాన్నే కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.
మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ నిన్న సాయంత్రం నుంచి అక్కడక్కడ ఒక మోస్తరు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భద్రాద్రిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో బొగ్గు గనుల్లో వరద నీరు చేరింది. దాంతో టేకులపల్లి పరిధిలోని కోయగూడెం గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. జుక్కల్, నిజాంసాగర్ మండలాల్లో భారీ వర్షం పడుతుండడంతో.. శేర్ఖాన్పల్లి వాగు పొంగి పొర్లుతుంది. భారీ వర్షం కారణంగా సిద్ధాపూర్ సమీపంలో రహదారిపై లారీ దిగబడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.