రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసింది. అకాల వర్షం వల్ల పంట నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తూర్పు మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలో మీటర్ వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
చెరువులను తలపించిన రోడ్లు
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరింది. కూకట్‌పల్లి, జీడిమెట్ల, సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, బేగంపేట, ఖైరతాబాద్, మల్కాజిగిరి, కుషాయిగూడా, కోఠి, కాచిగూడ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగర ప్రధాన రహదారులపై నీరు చేరింది. ఖైరతాబాద్, ఎర్రమంజిలి, బంజారాహిల్స్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో రహదారులు చిన్నపాటి చెరువులను తలపించాయి.
విద్యుత్తుకు అంతరాయం
వర్షం కారణంగా తెలుగు తల్లి పైవంతెన, ట్యాంక్ బండ్, సచివాలయం ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణ నెలకొంది. వర్షపు చినుకుల్లో ట్యాంక్‌బండ్, తెలుగు తల్లి పైవంతెన దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సికింద్రాబాద్‌లోని చిలకలగూడ, మారేడుపల్లి, బోయిన్పల్లి, ప్యారడైజ్, తిరుమలగిరి, బేగంపేట ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపై నీరు ఎక్కడికక్కడా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్తుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వడగండ్ల వాన
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ధర్మాజీపేట, తాట్లవాయి, దావనపల్లితోపాటు పలు గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. రాళ్ల వర్షం కురవడంతో మామిడి కాయలు రాలిపోయాయి. అసలే ఇబ్బందుల్లో ఉన్న రైతులకు వడగండ్ల వాన మరింత ఆందోళనకు గురి చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో ఈ రోజు సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా వర్షం వల్ల ఎవరికీ ఇబ్బంది కలగలేదు.
ఇదీ చూడండి:నేడు మరో 18 కరోనా పాజిటివ్ కేసులు