Rain Effect on Mango Orchards : వాతావరణ మార్పులతో మామిడి తోటలకు కష్టకాలం వచ్చింది. శీతాకాలంలో వడగండ్ల వర్షాలు, ఉష్ణోగ్రతల మార్పులతో మామిడి చెట్లకు పూత సరిగా రావడం లేదు. కొన్నింటికి పూత వచ్చినప్పటికీ చాలావరకూ రాలిపోతోంది. రాష్ట్రంలో రెండు రోజులుగా అక్కడక్కడా వడగండ్ల వానలు కురుస్తున్నాయి. రెండు నెలలుగా రాత్రిపూట ఉష్ణోగ్రత సాధారణంకన్నా ఆరేడు డిగ్రీల వరకూ నమోదవుతోంది. ఉదయం పూట పొగమంచు బాగా కురుస్తున్నందున పూతపై నలుపురంగు మచ్చలు ఏర్పడుతున్నట్లు ఉద్యానశాఖ అధ్యయనంలో గుర్తించారు. పూత రాలిపోకుండా కాపాడుకునేందుకు జిల్లాల వారీగా రైతులతో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఈ శాఖ జిల్లా ఉద్యానాధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో మామిడితోటల సాగు విస్తీర్ణం 4 లక్షల ఎకరాలు. ఈ ఏడాది దిగుబడి అంచనా 12 లక్షల టన్నులు.
పూత నల్లబడకుండా ఉండాలంటే..
Loss for Mango Orchards : సిద్దిపేట జిల్లా ములుగులో ఉద్యానశాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) కొత్తరకం వంగడాలతో హైడెన్సిటీ విధానంలో సాగు చేస్తున్నామని ఉద్యాన సంచాలకుడు ఎల్.వెంకట్రాంరెడ్డి చెప్పారు. ‘‘గతంలో భూమి ఎక్కువగా ఉన్నవారు మామిడి తోటలు ఎక్కువగా సాగుచేశారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న కమతాల్లోనూ అధిక మొక్కలు నాటి సంకరజాతి ‘రత్న’ అనేరకం వంగడాన్ని ములుగు సీఓఈలో నాటాం. రత్న రకం మొక్క ఎదుగుదలను నియంత్రించే కల్టాల్ అనే హార్మోన్‌ను నీటిలో కలిపి వేర్లకు అందించాం. ఈ రకానికి నవంబరులోనే పూత వచ్చింది. ఇప్పుడు చిన్నసైజు కాయలు కూడా వచ్చాయి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో పూత, కాత ముందుకు వచ్చింది. వాతావరణ మార్పుల ప్రభావం పంటలపై అధికంగా ఉంటోంది. రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’ అని సూచించారు. పూత రాలిపోతుంటే సమీపంలోని ఉద్యాన అధికారిని సంప్రదించాలన్నారు. లీటరు నీటికి పొటాషియం నైట్రేట్(మల్టీ-కె) అనే మందును 10 గ్రాముల చొప్పున కలిపి చల్లాలి. పూత వస్తున్న తోటల్లో తేనెమంచు పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటోంది. ఇవి పూత, ఆకుల నుంచి రసాన్ని పీల్చడంతో నల్లగా మారిపోతాయి. వీటి నివారణకు లీటరు నీటిలో క్లోరీఫైరిఫాస్ మందు 2.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి చల్లాలని సూచించారు.
15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతతో..
Mango Orchards in Telangana : రాత్రిపూట 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతతో చలి ఎక్కువగా ఉంటే మామిడికి పూత ఎక్కువగా వస్తుందని కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు భగవాన్ చెప్పారు. మరో వారం, పదిరోజుల్లో అన్ని ప్రాంతాల్లో పూత విస్తారంగా వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు.