తెలంగాణ

telangana

ETV Bharat / city

కొవిడ్ కూత: ఇబ్బందుల్లో రైల్వే కూలీలు - ఇబ్బందుల్లో రైల్వే కూలీలు

ఉన్న ఊరిలో ఉపాధి కరవై... బతుకుదెరువు కోసం పట్నం వచ్చిన బడుగులు వారు. ఏ పని దొరికినా చేసుకుందామని గంపెడాశలతో వచ్చారు. రైల్వే కూలీలుగా కుదురుకుని పొట్ట నింపుకుంటున్నారు. నాలుగు రాళ్లు సంపాదించనిదే... నాలుగు మెతుకులు తినలేని దుస్థితి. సాగిపోతుందిలే... అనుకునేలోపే కరోనా కాటేసింది. లాక్‌డౌన్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు సాయం చేశారు. ఇప్పుడు మాత్రం పూటగడవక అవస్థలు పడుతున్నారు.

railway hamali coolies facing problems with covid
కొవిడ్ కూత: ఇబ్బందుల్లో రైల్వే కూలీలు

By

Published : Jul 5, 2020, 7:46 PM IST

కొవిడ్ కూత: ఇబ్బందుల్లో రైల్వే కూలీలు

కరోనా కారణంగా రైల్వే కూలీలు అల్లాడిపోతున్నారు. నాలుగు నెలలుగా చేతిలో పనులు లేక పస్తులుంటున్నారు. భార్యాబిడ్డల బాధలు చూడలేక కంటతడి పెడుతున్నారు. మార్చి 25 నుంచి రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం వల్ల కార్మికులు కుదేలయ్యారు. తర్వాత ప్రత్యేక రైళ్లు నడిచినా... పరిమిత సంఖ్యలో ఉన్నందున అరకొర డబ్బులతో అవస్థలు పడుతున్నారు. పరిమితంగా నడిచే రైళ్లు కూలీల ఆకలి తీర్చలేకపోతున్నాయి. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో 20వేలకుపైగా కూలీలు ప‌నిచేస్తున్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా ప్రయాణికుల రైళ్ల ర‌ద్దుతో... పనులు లేక కార్మికులు ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల పునఃప్రారంభించినా... వైరస్‌ ఉద్ధృతితో ప్రజలు ఆశించిన స్థాయిలో స్టేషన్లకు రాకపోవడం వల్ల... అర్ధాకలితో ఇబ్బందులు పడుతున్నారు.

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్ల పరిధిలో ప్రయాణికుల సంచులు మోసి 500మంది కూలీలు జీవనోపాధి పొందేవారు. మూడు నెల‌లుగా రైళ్లు న‌డ‌వక‌పోవ‌డం వల్ల కార్మికుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. కొన్ని రైళ్లు న‌డిపేందుకు స‌డ‌లింపులు ఇచ్చినా... ప‌రిస్థితిలో కాస్త మార్పు కన్పిస్తుందని ఆశించారు. కానీ వచ్చిన డ‌బ్బులు ఇంటి అద్దె, స‌రుకులకు కూడా స‌రిపోవ‌డం లేదని ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు ఆకలి... మరోవైపు భారీగా పెరుగుతున్న కరోనా కేసులు... వీటిమధ్యే బిక్కుబిక్కుమంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు కార్మికులు.

కొవిడ్‌ బారిన పడతామేమోననే ఆందోళన ఉన్నప్పటికీ... తప్పని పరిస్థితుల్లో నెట్టుకొస్తున్నారు. వీరి బాధలు చూసి చలించిన రైల్వే అధికారులు, ఉద్యోగుల మహిళా సంఘం, వాణిజ్య విభాగాలు కలిసి... కార్మికులందరికీ రెండుసార్లు 10 కిలోల బియ్యం, రూ.600 విలువైన రేషన్‌ సరకులు, రూ. 500 నగదు ఇచ్చి ఆదుకున్నారు. ఈ సాయం వారికి ఊరటనిచ్చినా... రైళ్లు పూర్తిస్థాయిలో నడవక ఇప్పుడు వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఆగస్టు రెండో వారం వరకూ రైళ్లు నడపబోమన్న భారతీయ రైల్వే ప్రకటనతో.. కూలీలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.

ఇదీ చూడండి:కరోనా అంటే వైరస్‌ ఒక్కటే కాదు.. చాలా అర్థాలున్నాయ్‌

ABOUT THE AUTHOR

...view details