ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా సంస్థలు తీపికబుర్లు వినిపిస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా బోనస్‌లు ప్రకటిస్తున్నాయి. ఈ శుభవార్తతో ఉద్యోగులు, కార్మికుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే రైల్వే ఉద్యోగులు, కార్మికులకు ఆయా సంస్థలు బోనస్‌లు ప్రకటించాయి.
భారతీయ రైల్వే తమ ఉద్యోగులకు రూ.1,984 కోట్లను బోనస్‌గా ప్రకటించిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య వెల్లడించారు. ద.మ.రైల్వే పరిధిలోని ఒక్కో కార్మికుడికి 78 రోజుల వేతనం రూ. 17,951లను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ద.మ.రైల్వేలో 84 వేల మంది ఉద్యోగులు ఉన్నారని.. వాళ్ల కోసం రూ.130 కోట్లు అందుకోసం వెచ్చించామన్నారు. రైల్ నిలయం నుంచి ద.మ.రైల్వే జీఎం దృశ్య మాద్యమం ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు.
కరోనా సమయంలో అనేక సేవలు..
"కరోనా సమయంలో కూడా దక్షిణ మధ్య రైల్వే అనేక సేవలు అందించాం. ఎంఎంటీఎస్‌ను, ప్రయాణికుల రైళ్లను కూడా పాక్షికంగా ప్రారంభించాం. మౌలిక వసతులపై కూడా ద.మ.రైల్వే దృష్టిసారించింది. రైతుల సౌకర్యార్థం 470 కిసాన్ రైళ్లను నడిపించాం. కరోనా సమయంలో సైతం ద.మ.రైల్వే.. లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ సరఫరా కూడా చేసింది. 281.1 కిలోమీటర్ల పరిధిలో డబ్లింగ్ పూర్తిచేశాం. కరోనా తర్వాత 85 ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం." - గజానన్ మాల్య, దక్షిణ మధ్య రైల్వే జీఎం