కరోనాపై రైల్వేశాఖ అప్రమత్తమైంది. కరోనా వైరస్ కేసుల పట్ల వ్యవహరించాల్సిన విధానాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో.. రైల్వే బోర్డు జోన్‌లోని వైద్యాధికారులందరికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చారు. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, గుంటూరు, గుంతకల్లు, విజయవాడల్లోని 27 ప్రదేశాలలో కరోనా అనుమానితులను వేరుగా ఉంచేందుకు 1,019 పడకలు సిద్ధం చేశారు. రైల్వే అధికారులు తరచుగా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, వైద్యాధికారులను సంప్రదిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండాఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనావేస్తూ తగిన చర్యలు చేపడుతున్నారు.
నిర్మానుష్యంగా రోడ్లు..
హైదరాబాద్ మహానగరంలో కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అర్ధరాత్రి వరకు హడావుడిగా ఉండే హోటల్స్, రెస్టారెంట్స్, రహదారులు బోసిపోయాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించగా.. ఐటీ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఫలితంగా రోడ్లపై రద్దీ తగ్గింది. పరిస్థితి అదుపులో ఉందని ప్రభుత్వం చెబుతోన్నా... ప్రజల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు.