తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని హితవు పలికారు. మనస్పర్ధలు, విభేదాలు ఉంటే పార్టీ వేదికపైనే చెప్పాలని... ఎక్కడపడితే అక్కడ ఇష్టారీతిలో మాట్లాడొద్దని స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఏమైనా ఉంటే తనతో, కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడాలని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. దిల్లీలో రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో 39 మంది నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించటమే కాంగ్రెస్ లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు ప్రజాసమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాడేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, అంతర్గత వ్యవహారాలపై చర్చించినట్లు తెలిపారు. భిన్నాభిప్రాయాలను పక్కనబెట్టి ఏకతాటిపైకి వచ్చి తెరాస, భాజపాలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లండించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం తీసుకొచ్చేందుకు రాష్ట్రానికి రాహుల్ గాంధీ వరుస పర్యటనలు చేస్తారని చెప్పారు. రాహుల్‌గాంధీ సమక్షంలోనే ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు టికెట్ల కేటాయింపు జరగనుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రానికి రావాలని రాహుల్‌గాంధీని ఆహ్వానించినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. వీలైనన్ని ఎక్కువసార్లు రాష్ట్రంలో పర్యటిస్తానని రాహుల్ చెప్పారని భట్టి వెల్లడించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కలిసి సాగుతామని స్పష్టం చేశారు. తెరాస, మజ్లిస్‌తో పొత్తు ఉండదని రాహుల్ సమక్షంలో నిర్ణయించినట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాహుల్‌గాంధీ సమక్షంలోనే శాసనసభ టికెట్ల కేటాయింపు ఉంటుదని పేర్కొన్నారు. ఐకమత్యంతో సాగుతూ తెరాస, భాజపాను ఓడిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
జిల్లాల్లో పార్టీ బలోపేతం, పీసీసీ చీఫ్ వ్యవహారశైలిపై మాట్లాడినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఏడాది ముందే అభ్యర్థులను ఖరారు చేసి కార్యాచరణ చేపట్టాలని కోరినట్లు వెల్లడించారు. కరీంనగర్ జిల్లాలో 1-2 చోట్ల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకపక్షంగా అభ్యర్థులను ఖరారని... జిల్లా నేతలు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబుతో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అభ్యర్థుల ప్రకటనకు అధిష్ఠానం అనుమతి ఇచ్చిందా అని రాహుల్ గాంధీని అడిగినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు.
అంతకు ముందు... ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్, సెక్రటరీలు బొసరాజు, శ్రీనివాసన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత వ్యవహారాలు, సభ్యత్వ నమోదు, ఏఐసీసీ పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ అంశాలపై చర్చించారు.
సోనియాతో వీహెచ్ భేటీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో వీహెచ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సోనియాతో చర్చించించినట్లు వీహెచ్ తెలిపారు. ప్రజల పక్షాన చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లు, పెట్రో ధరలు, నిత్యావసరాల ధరల పెంపుపై పోరాడాలని సోనియా చెప్పారని వీహెచ్ చెప్పారు. రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తానని పేర్కొన్నారు. నాయకత్వ బాధ్యతల్లో ఉన్నవారు సీనియర్లను గౌరవించాలని... అనుభవాన్ని ఉపయోగించుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి :ఏంటీ..! సమంత- నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారా?