సిద్దిపేట ఘటనపై హైకోర్టులో రఘునందన్‌రావు పిటిషన్
15:02 November 12
సిద్దిపేట ఘటనపై హైకోర్టులో రఘునందన్‌రావు పిటిషన్
సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనను కేసుల్లో ఇరికించేందుకు సిద్దిపేటలో రూ.18 లక్షలు లభించినట్లు ప్రభుత్వం కట్టు కథ అల్లిందని పేర్కొన్నారు. తనను ఎన్నికల ప్రచారం చేసుకోకుండా అడ్డుకునేందుకే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసి... దర్యాప్తు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఓట్ల లెక్కింపునకు ముందు రఘునందన్ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ జస్టిస్ లక్ష్మణ్ బెంచి వద్ద విచారణకు వచ్చింది. పిటిషన్‌పై విచారణ జరిపేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనమే విచారణ చేపడతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఎమ్మెల్యే కాకముందే కేసు నమోదైందని... పిటిషన్ కూడా అంతకు ముందే దాఖలైందని రఘునందన్ తరఫున న్యాయవాది విష్ణువర్దన్ రెడ్డి వాదించారు. రఘునందన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నందున... పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరుతున్నందున... వీలైనంత త్వరగా పంపించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి:డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు నివేదిక కోరిన హైకోర్టు