రాచకొండ పోలీసు కమిషనరేట్... వైశాల్యంలో అతి పెద్దది. విస్తీర్ణంలో పెద్దగా ఉన్న ఈ కమిషనరేట్ మల్కాజిగిరి, ఎల్బీనగర్, భువనగిరి మూడు డివిజన్లతో కూడి ఉంది. రాచకొండ పోలీసు కమిషనర్‌గా కొనసాగుతున్న మహేశ్ భగవత్ లాక్‌డౌన్ సమయంలో మానవత్వాన్ని చాటుతున్నారు. కమిషన్‌రేట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ... పేదవారికి, వలస కూలీలకు పట్టెడు అన్నం అందేట్లు చూస్తున్నారు. ఈయన చేస్తున్న సేవలను చూసి... రామకృష్ణమఠ్, శ్రీజ్వాలా ప్రయోగ్య సెంట్రల్ ట్రస్టు, లైయన్స్‌క్లబ్ లాంటి 90 స్వచ్ఛంద సంస్థలు, మెఘా, దివీస్, టీసీఎస్, ఐఎస్‌బీ, ఇన్‌ఫోసిస్, ఐఓసీఎల్ లాంటి 70 కంపెనీలు, 390 మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలు భాగస్వామ్యులయ్యారు.
నిత్యావసరాలు, వైద్య సేవలు
కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు పది లక్షల అన్నం ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు పేదలకు, కూలీలకు అందచేశారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 42 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి 24 గంటలు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్యం ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించేందుకు అవినాష్‌రెడ్డి, కేశవ్, శ్రీనివాసరావు అనే ముగ్గురు వైద్యుల బృందం ముందుకొచ్చి ఇప్పటి వరకు దాదాపు 12వందల మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించింది.
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోసియల్ సర్వీస్-టిస్ సహకారంతో ఎల్బీనగర్, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వలస కూలీలపై సర్వే చేసి 2,715 మందిని వివిధ చోట్ల షెల్టర్లు ఏర్పాటు చేసి వాళ్లకు అవసరమైన సహాయం అందచేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన లారీ డ్రైవర్లకు పతంగి, గూడూరు, బీఎన్‌రెడ్డి నగర్ తదితర ప్రాంతాల వారికి భోజనం, వసతి ఏర్పాటు చేశారు.
లాక్‌డౌన్ సమయంలో... వాహనరాకపోకలు స్తంభించినందున... వయోవృద్ధులకు మహిళలకు ఉచితంగా అత్యవసర సేవలు అందించేందుకు మహేంద్ర ఎలైట్ సహకారంతో ఏడు వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 7 నుంచి 19 వరకు 565 కాల్స్ రాగా 342 కాలర్స్‌కు సేవలు అందించారు. టీసీఎస్ కంపెనీ ఆధ్వర్యంలో మెడికల్ ఎమర్జెన్సీ కోసం రెండు అంబులెన్స్‌లు అందుబాటులోకి తెచ్చారు.
మానసిక స్థితికి కౌన్సిలింగ్
లాక్‌డౌన్ కారణంగా ఒంటిరితనంతో మానసిక ఇబ్బందులు పడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు నలుగురు కౌన్సిలర్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉదయం 9.30గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్ధులు, మహిళల నుంచి ఎక్కువగా కాల్స్ వస్తుండగా ఇటీవల ఓ మహిళ ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉండి కాల్ చేయగా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి సాధారణ పరిస్థితులకు తెచ్చారు కౌన్సిలర్లు. అదే విధంగా పలువురు ఉద్యోగ భద్రత ఉండదని ఆందోళన చెంది... నిద్రలేమితో బాధపడుతుండగా వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి సాధారణ స్థితికి కౌన్సిలర్లు తెచ్చారు.
లాక్‌డౌన్ కారణంగా కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి, అధికారులకు 16 వేలకుపైగా వంద మిల్లీలీటర్ల శానిటైజర్ బాటిళ్లు, 13 వేలకుపైగా మాస్క్‌లు, రెండున్నర వేలు గ్లౌజులు, రెండు వందలు వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించారు. అదేవిధంగా విధులు నిర్వర్తిస్తున్న చోటకే సిబ్బందికి భోజనం, శీతలపానీయాలు, సబ్బులు, దోమల నివారణ రెప్‌లెంట్లు చేరవేస్తున్నారు. అదేవిధంగా మెడికల్ పరీక్షలు చేయించి విటమిన్లు లోపం ఉన్న వెయ్యికిపైగా సిబ్బందికి ఇమ్యూనిటీ పెంచేందుకు అవసరమైన విటమిన్ల ట్యాబ్లెట్లు, చియ్వాన్‌ప్రాస్ లాంటివి కూడా అందచేస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా పేదలను, వలస కూలీలను, సిబ్బందికి ఏలాంటి కొరత లేకుండా సేవలు అందిస్తూ... కమిషనర్ మహేశ్ భగవత్ మానవత్వాన్ని చాటుతూ సిబ్బంది మన్ననలను పొందుతున్నారు.
ఇదీ చూడండి:లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయాలు.. రేపటి నుంచే అమలు