చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని... లేనిపక్షంలో తిరుగుబాటు ఉద్యమం వస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని... అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ చేశారు. బీసీల హక్కుల కోసం వచ్చే నెల 18న తలపెట్టిన "ఛలో దిల్లీ" కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు.
'బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడమే నా అంతిమ లక్ష్యం' - ఛలో దిల్లీ కార్యక్రమ పోస్టర్ను విడుదల చేసిన ఆర్ కృష్ణయ్య
దేశంలో 56 శాతం బీసీ జనాభా ఉంటే... చట్టసభల్లో మాత్రం 14 శాతమే ప్రాతినిథ్యం ఉండటం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. తన ఉద్యమ జీవితంలో 11 వేలకు పైగా ఉద్యమాలు చేశానని... చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడమే తన అంతిమ ఉద్యమ లక్ష్యంగా పోరాడుతానని స్పష్టం చేశారు.

బీసీలతో రాజకీయ పార్టీలు జెండా మోయించి ఓట్లు వేయించుకున్నాయని... కానీ బీసీలకు రాజ్యాధికారం ఏ పార్టీ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనం కోసం బీసీలను బిచ్చగాళ్లను చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ బిల్లుపై అన్ని పార్టీల వైఖరిని బహిర్గతం చేయాలన్నారు. తెరాస ప్రభుత్వం అఖిలపక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్లి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కేంద్రంలో 72 మంత్రిత్వ శాఖలు ఉన్నాయని... కానీ బీసీ మంత్రిత్వశాఖ కేటాయించకపోవడం దారుణమన్నారు. వచ్చే నెల 18న జరిగే ఛలో ఢిల్లీ కార్యక్రమంలో బీసీలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.