వరంగల్ గీసుకొండ ‘మృత్యుబావి’ కేసులో నిందితుడికి ఐదు నెలల వ్యవధిలోనే విచారణ పూర్తయి బుధవారం మరణశిక్ష ఖరారైంది. తెలంగాణలో గత ఏడేళ్లలో ఇలాంటి ఉదంతాలు కొన్ని చోటుచేసుకున్నాయి. 2013 అక్టోబరులో సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ‘అభయ’పై క్యాబ్ డ్రైవర్ల అత్యాచారం ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది.
అప్పటి నుంచే కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాల ఏర్పాటు ఊపందుకొంది. ఆ కేసులో 209 రోజుల్లో తీర్పు వెలుడింది. ఇద్దరు యువకులకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష పడింది. ఇటీవలి కాలంలో వరుసగా ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానాల తీర్పులు వెలువడుతున్నాయి. దర్యాప్తు అధికారులు పకడ్బందీ సాక్ష్యాధారాలను కోర్టులకు సమర్పిస్తుండటంతో నిందితులకు గరిష్ఠ శిక్షలు ఖరారవుతున్నాయి.
20 రోజుల్లోనే అభియోగపత్రం..
హన్మకొండలో 2019 జూన్ 18న అర్ధరాత్రి దాటిన తర్వాత తొమ్మిది నెలల చిన్నారి అపహరణకు గురైంది. ఆరుబయట తల్లి పక్కన పడుకున్న చిన్నారిని తాగిన మైకంలో హన్మకొండ కుమార్‌పల్లికి చెందిన ప్రవీణ్ ఎత్తుకెళ్లాడు. పాశవికంగా అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశాడు. ఈ కేసును వరంగల్ కమిషనరేట్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని 20 రోజుల్లోనే అభియోగపత్రం దాఖలు చేశారు. 30 మంది సాక్షుల్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టారు. 48 రోజుల్లోనే ప్రవీణ్‌కు మరణశిక్ష పడింది. తర్వాత దోషి హైకోర్టును ఆశ్రయించగా యావజ్జీవ శిక్షగా తగ్గించారు.