Irrigation projects in trouble: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను జాప్యం లేకుండా పూర్తి చేసేందుకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం (యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం-ఏఐబీపీ) కింద చేర్చి ఒకటిన్నర దశాబ్దం దాటింది. అయితే భూసేకరణ, పునరావాసం, పిల్లకాల్వలు పూర్తి కాకపోవడం, జాతీయ రహదారులపై బ్రిడ్జిల నిర్మాణంలో జాప్యం ఇలా పలు కారణాల వల్ల ఇప్పటికీ అవి పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టుల్లో ఆయకట్టు అభివృద్ధి, నీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటు తదితర పనులకు శ్రీకారం చుట్టి కూడా అయిదేళ్లు దాటింది. సత్వర సాగునీటి ప్రయోజన పథకాన్ని అయిదేళ్ల క్రితం ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన (పీఎంకేఎస్‌వై)గా కేంద్రం మార్చింది. కేంద్రం నుంచి నిధులు అందుతూ రూ.500 కోట్ల కంటే ఎక్కువ విలువ ఉన్న ప్రాజెక్టులపై కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ దృష్టి సారించింది. గత కొంత కాలంగా పనుల పురోగతిపై రాష్ట్ర అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఇలాంటివి దేశవ్యాప్తంగా 50 ప్రాజెక్టులుండగా, అత్యధికంగా మహారాష్ట్రలో 20... తెలంగాణలో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పురోగతి, ఆయకట్టు అభివృద్ధిపై మే 6న కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి.. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలోని దేవాదుల, రాజీవ్ భీమా, శ్రీరామసాగర్ రెండోదశ, శ్రీరామసాగర్ వరదకాలువ పనుల పూర్తికి గత సమావేశంలో నిర్ణయించిన లక్ష్యాలు, అమలు జరిగిన తీరుపై వచ్చే సమావేశంలో సమీక్షించనున్నారు.
దేవాదులకు భూసేకరణ సమస్య..దేవాదుల ఎత్తిపోతల పథకానికి భూసేకరణ ప్రధాన సమస్యగా ఉంది. 2006-07లో ఏఐబీపీ కింద గుర్తించిన ఈ ప్రాజెక్టులో బ్రాంచ్ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వల పనులు 50-60 శాతం వరకే పూర్తయ్యాయి. 2,48,685 హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం లక్ష్యం కాగా, 1,23,940 హెక్టార్లకు సంబంధించిన పనులు పూర్తి చేశారు. 68,747 హెక్టార్ల ఆయకట్టుకు నీరిచ్చామని గత డిసెంబరు నాటికి ఇచ్చిన నివేదికలో సంబంధిత ఇంజినీర్లు పేర్కొన్నారు. 1,247 హెక్టార్ల భూమిని ఇంకా సేకరించాల్సి ఉండగా, 533 హెక్టార్ల సేకరణ పురోగతిలో ఉందని, 713 హెక్టార్లను 2022 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ఇంజినీర్లు హామీ ఇచ్చారు. ఇక్కడ భూసేకరణకు సంబంధించి అయిదు కేసులు కోర్టులో ఉన్నాయి. తాజాగా 2023 మార్చినాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నారు.
భీమా.. పునరావాసంలో జాప్యం:రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాన్ని 2007-08లో ఏఐబీపీ కింద గుర్తించారు. 74 శాతం డిస్ట్రిబ్యూటరీలు, 69 శాతం పిల్లకాల్వలు పూర్తయ్యాయి. 82,153 హెక్టార్లకు 59,813 హెక్టార్ల ఆయకట్టుకు నీరందించారు. 109 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉంది. ఎనిమిది గ్రామాలకు గాను అయిదు ఊర్లను తరలించాల్సి ఉంది. రంగసముద్రం కింద నగరాల గ్రామ తరలింపు పూర్తి కాకపోవడంతో 50 శాతం నీటినే నిల్వ చేశారు. శంకరసముద్రం రిజర్వాయర్ కింద రెండు గ్రామాలను తరలించాల్సి ఉంది. 1.818 టీఎంసీల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్‌లో 0.796 టీఎంసీలను నిల్వ చేశారు. రిజర్వాయర్ రెండుగ్యాప్‌ల నిర్మాణం కూడా పూర్తి చేయాల్సి ఉంది. తాజాగా 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం.