తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెరాస ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించింది.
ఆస్ట్రేలియాలో ఘనంగా మాజీ ప్రధాని పీవీ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. తెరాస ఆస్ట్రేలియా విభాగం ఆధ్వర్యంలో మెల్బోర్న్, సిడ్నీ, కాన్బెర్రా, అడిలైడ్, బ్రిస్బేన్‌లో పీవీ జయంతి ఉత్సవాలు జరిపారు. తెరాస ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, విక్టోరియా ఇంజార్జి ఉప్పు సాయిరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పీవీకి నివాళులు అర్పించారు.
డెన్మార్క్‌లో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీవీ విగ్రహ ఆవిష్కరణకు కృషి చేయనున్నట్లు తెలిపారు. యూరప్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు శ్యాంబాబు ఆకుల, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ అధ్యక్షుడు రాజు కుమార్ కలువల, తెరాస డెన్మార్క్ విభాగం అధ్యక్షుడు జయచందర్ గంట తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.