ప్యూర్ యూత్... అనేది ప్యూర్ అనే స్వచ్చంద సంస్థకు అనుబంధంగా పని చేస్తుంది. పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థకు సంక్షిప్త రూపమే ప్యూర్. శైలా తాళ్లూరి అనే ఎన్ఆర్ఐ తన స్నేహితులతో కలిసి ఈ సంస్థను అమెరికాలో ఏర్పాటు చేశారు. అమెరికా, ఆఫ్రికాతో పాటు..భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు విద్యాసంస్థలకు సౌకర్యాలు కల్పిస్తుంది. దానికి అనుబంధంగానే ప్యూర్ యూత్ 2017లో ఏర్పాటైంది. ఇందులో అందరూ టీనేజీ పిల్లలే సభ్యులు. పాఠశాలల్లో, కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు.. తమ చుట్టూ ఉన్న సమాజానికి ఎంతో కొంత మేలు చేసేలా ప్రోత్సహించడమే ఈ వింగ్ ముఖ్య ఉద్దేశ్యం. ప్యూర్ యూత్ పిల్లలు తాము చదువుకుంటూనే అవసరమైన సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు.. అందుకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు.
మన తెలుగు పిల్లలే ఎక్కువ....
ప్యూర్ యూత్ అమెరికా కేంద్రంగా ఉన్నప్పటికీ ఇందులో ఎక్కువ మంది మన తెలుగు పిల్లలే..! తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి యూఎస్ లో స్థిరపడిన వారి పిల్లలే ఇందులో సభ్యులుగా ఉన్నారు. యూఎస్‌లోనే ప్యూర్‌కు 30 చాప్టర్లు ఉన్నాయి. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ స్టూడెంట్ చాప్టర్లు ఉన్నాయి. ఇవి కాకుండా భారత్‌లోని వైజాగ్‌లో కూడా ప్యూర్ యూత్ చాప్టర్ పనిచేస్తోంది. చాప్టర్లలోని సభ్యులను యూత్ అంబాసిడర్లుగా పిలుస్తారు. ఇతర దేశాల్లో, ప్రాంతాల్లో ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం.. వారిని నేరుగా కానీ.. ఆన్లైన్ ద్వారా కానీ కలవడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం సాంకేతిక అంశాలను ఒకరినొకరు పంచుకోవడం చేస్తుంటారు. ప్యూర్ యాత్ చాప్టర్లకు.. హేమ కంఠంనేని చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా నాయకత్వం వహిస్తున్నారు.
వరంగల్, హైదరాబాద్‌లోనూ..
ప్యూర్ యూత్ సభ్యులంతా వివిధ కార్యక్రమాలు నిర్వహించి... నిధులు సమీకరిస్తుంటారు. వాటితోనే భారత్‌తో సహా అనేక ప్రాంతాల్లో పాఠశాలలకు సౌకర్యాలు కల్పిస్తుంటారు. తమ మాతృసంస్థ ప్యూర్ ద్వారా ఈ పనులు జరుగుతాయి. వరంగల్ జిల్లా మొగిలిచర్లలోని ప్రభుత్వ పాఠశాలకు డైనింగ్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్ సమకూర్చడంతో పాటు.. పుస్తకాలు అందజేశారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని కొన్ని పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు, కంప్యూటర్లు, బెంచ్‌లు సమకూర్చారు. హైదరాబాద్‌లోని గౌరెల్లి, జనగాం పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలోని పాఠశాలలకు 46వేల నోట్ బుక్స్ అందజేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చే విద్యార్థినుల కోసం సైకిళ్లు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో ఈ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు జరిగాయి. మెదక్ జిల్లాలోని అహ్మద్‌నగర్, ధర్మసాగర్ జిల్లా పరిషత్ పాఠశాలను దత్తత తీసుకున్నారు.