తెలంగాణలో కార్తిక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో నిర్వహించిన లక్ష దీపాల కార్యక్రమంలో మహిళలు లక్ష దీపాలను వెలిగించారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తిక దీపోత్సవంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు.
కృష్ణమ్మకు హారతి..
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ తుంగభద్ర నదికి వేదమంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు నదికి హారతులిచ్చారు. దేవరకద్రలో జడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మహిళలతో కలసి దీపాలను వెలిగించారు. నకిరేకల్‌లోని ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజన్నకు జ్వాలాతోరణం
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన జ్వాలాతోరణ కార్యక్రమంలో స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపు చేశారు. జగిత్యాల, ఖమ్మం, బోధన్‌లలో లక్ష దీపోత్సవం కార్యక్రమం నిర్వహించగా.. చొప్పదండి, పటాన్‌చెరు, నిర్మల్‌లో మహిళలు దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా బినోల వద్ద గోదావరి నదికి మహా హారతి కార్యక్రమం నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై కోటిదీపోత్సవం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన కోటిదీపోత్సవంలో మహిళలు చూడచక్కని రంగవల్లులు వేసి వాటిలో దీపాలు వెలిగించేందుకు పోటీపడ్డారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉత్సవమూర్తులకు జ్వాలా తోరణం వైభవంగా జరిగింది. తిరుమలలో కన్నుల పండువగా సాగిన శ్రీవారి గరుడవాహన సేవలో.. సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి.. గరుత్మంతునిపై తిరువీధుల్లో విహరించారు.
పున్నమి కాంతుల్లో.. వన్నెల దీపాలు..! ఇదీ చదవండి: కార్తిక దీపాల వెలుగుల్లో మహిళలు