Amaravati Farmers Mahapadayatra: ఏపీలో అమరావతి రైతుల పాదయాత్ర 41వ రోజూ ఉత్సాహంగా సాగింది. శ్రీకాళహస్తి మహిళలు.. రైతులు బస చేస్తున్న శిబిరానికి వచ్చారు. మహిళా రైతులకు తాంబూలం ఇచ్చి పాదాభివందనం చేసి గౌరవించారు. సాటి ఆడపడచులు పడుతున్న వేదన చూస్తే బాధ కలుగుతోందన్నారు. రాయలసీమ వాసులమైనా రాజధానిగా అమరావతికే మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.
అమరావతి రైతుల సంకల్పం మహారాష్ట్ర వాసులను సైతం కదిలించింది. పుణె, పింప్రి, బోసారి, చించువాడ్ ప్రాంతాలకు చెందిన రైతులు.. రాజధాని అమరావతి పోరాటానికి మద్దతు తెలిపారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని.. అది అమరావతి కావాలని నినదించారు. వీరితో పాటు మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగువారు సైతం తరలివచ్చి అన్నదాతలతో కలిసి నడిచారు. చిత్తూరు జిల్లా ప్రజలతో పాటు వివిధ జిల్లాల నుంచి ప్రజాసంఘాలు తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించాయి. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి నేతృత్వంలో కళ్యాణదుర్గం నుంచి తెలుగుదేశం శ్రేణులు రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. 'మా ఊరు అనంతపురం-మా రాజధాని అమరావతి' అంటూ..నినదించారు. భాజపా, సీపీఐ, సీపీఎం నేతలు కూడా రైతులతో కలిసి నడిచారు.
ఈనెల 17న తిరుపతిలో తలపెట్టిన ముగింపు సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై.. హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు ఐకాస నేతలు తెలిపారు. ముందుగానే లేఖ ఇచ్చినా పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని చెప్పారు.