PSLV C-52 Countdown: పీఎస్‌ఎల్‌వీ-సీ52 కౌంట్‌డౌన్ ప్రారంభం
PSLV C-52 Countdown: పీఎస్‌ఎల్‌వీ-సీ52 వాహక నౌక ప్రయోగానికి సిద్ధమైనవేళ... శ్రీహరికోట షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం వేకువజామున 4.29 నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 25:30 గంటల పాటు కొనసాగిన పిదప.. సోమవారం ఉదయం 5.59కి పీఎస్‌ఎల్‌వీ-సీ52 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
PSLV
By
Published : Feb 13, 2022, 7:57 AM IST
PSLV C-52 Countdown: పీఎస్‌ఎల్‌వీ-సీ52 వాహక నౌక ప్రయోగానికి సిద్ధమైనవేళ... శ్రీహరికోట షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. శనివారం రాకెట్ సన్నద్ధత(ఎంఆర్‌ఆర్), లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్) సమావేశాలు నిర్వహించారు. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలోనే ఎంఆర్‌ఆర్ సమావేశం జరిగింది. సాయంత్రం పొద్దుపోయే వరకు జరిగిన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) సమావేశంలో రాకెట్ ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. శుక్రవారం రాత్రి 11.59 నుంచి శనివారం ఉదయం 5.59 గంటల వరకు నిర్వహించిన రిహార్సల్ విజయవంతమైంది.
అది ముగిసిన వెంటనే ప్రీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆదివారం వేకువజామున 4.29 నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 25:30 గంటల పాటు కొనసాగిన పిదప.. సోమవారం ఉదయం 5.59కి పీఎస్‌ఎల్‌వీ-సీ52 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది 1710 కిలోల బరువు ఉన్న ఆర్‌ఐశాట్(ఈవోఎస్-04), 17.5 కిలోల ఐఎన్‌ఎస్-2టీడీ, 8.1 కిలోల ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాన్ని విద్యార్థులు రూపొందించారు. యూఎస్‌లోని కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయంలోని లాబొరేటరీ ఫర్ అట్మాస్ఫియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్, నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీ, తైవాన్, సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం, తిరువనంతపురంలోని ఐఐఎస్‌టి సహకారంతో రూపకల్పన చేశారు.
చెంగాళమ్మ సేవలో..
పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ శనివారం సాయంత్రం చెంగాళమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఉదయంసీనియర్ శాస్త్రవేత్తలు తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని, వాహకనౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఎస్‌ఎల్‌వీ-సి52 వాహకనౌక ద్వారా పంపుతున్న ఆర్‌ఐశాట్-1 ఉపగ్రహంతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
శ్రీహరికోట షార్‌లో సందడి వాతావరణం...
సోమవారం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్- సీ52(పీఎస్‌ఎల్‌వీ) వాహక నౌక ప్రయోగం నేపథ్యంలో ఇస్రోలోని అన్ని కేంద్రాల సంచాలకులు, సీనియర్ శాస్త్రవేత్తలు ఇక్కడికి చేరుకున్నారు. అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డాక్టర్ సోమనాథ్ తొలిసారి శనివారం షార్‌కు విచ్చేశారు. రోజంతా తీరిక లేకుండా గడిపారు. ఉదయం 9 గంటలకు చెన్నై నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల బందోబస్తు మధ్య షార్‌కు విచ్చేయగా- మొదటి గేటు వద్ద భద్రతా దళాలు గౌరవ వందనం సమర్పించేందుకు సిద్ధమయ్యాయి. ఆ ప్రయత్నాన్ని సోమనాథ్ సున్నితంగా తిరస్కరించారు. నేరుగా భాస్కర అతిథి భవనానికి చేరుకున్నారు. విశ్రాంతి అనంతరం షార్‌లోని వసతులను పరిశీలించారు. కాన్ఫరెన్స్ హాలుకు చేరుకుని అవుట్ సైడ్ ఏజెన్సీల నిర్వాహకులతో చర్చించారు.
పీఎస్‌ఎల్‌వీ-సి52 ప్రాజెక్టులపై సమీక్ష..
భాస్కర అతిథి భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం సాయంత్రం 6.30 నుంచి సుమారు 2 గంటలకుపైగా షార్‌లోని వివిధ ప్రాజెక్టులపై స్థానిక సంచాలకులు డిప్యూటీ డైరెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షించారు. ఆగ్మెంటేషన్ ఆఫ్ సాలిడ్ మోటార్ల ప్రొడక్షన్ ఫెసిలిటీస్, పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ, ఎల్‌ఎల్‌పీ ఆగ్మెంటేషన్ ప్రాజెక్టు ఫర్ సెమీ క్రయో స్టేజ్, ఎస్‌ఎస్‌పీ ఆగ్మెంటేషన్ ప్రాజెక్టు నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టులో చేపట్టే చంద్రయాన్-3, గగనయాన్ ప్రాజెక్టులపైనా చర్చించినట్లు సమాచారం. షార్ సంచాలకులు ఆర్ముగం రాజరాజన్, అసోసియేట్ డైరెక్టర్ బద్రి నారాయణమూర్తి, వీఏఎల్‌ఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రామన్, ఎంఎస్‌ఏ డిప్యూటీ డైరెక్టర్ సెంథిల్‌కుమార్, ఎంఎస్‌జీ జీడీ గోపీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.