తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన నిరసనలు - VISHAKA steel news

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన ఆందోళన.. ఉద్యమజ్వాలగా మారింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సంస్థ ఉద్యోగులు, కార్మికులు..పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు.. భాజపా మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే అన్న నేతలు.. అప్పటి వరకు పోరాటం ఆగబోదని తేల్చిచెప్పారు.

VISHAKA steel news
VISHAKA steel news

By

Published : Feb 6, 2021, 8:06 AM IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై.. ఏపీలో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రం నిర్ణయాన్ని పార్టీలకతీతంగా నేతలంతా.. తీవ్రంగా వ్యతిరేకించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై... మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కూడా.. రాష్ట్ర నేతల్లో కనీస పోరాట స్ఫూర్తి లేకపోవడం చూస్తే తెలుగు వారిలో చేవ చచ్చిందా అనే అనుమానం కలుగుతుందని ఆవేదన వెలిబుచ్చారు.

జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదు

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ...తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌... ముఖ్యమంత్రి జగన్‌కి లేఖ రాశారు. 28 మంది వైకాపా ఎంపీలు దిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ తెరపైకి వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందన్న లోకేశ్‌... విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా చేయాలని డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో కేంద్ర బడ్జెట్‌పై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తామన్నా..సీఎం జగన్‌ ఎందుకు మాట్లాడలేక పోతున్నారని...భేటీలో పాల్గొన్న నేతలు నిలదీశారు.

భూములను విక్రయించేందుకే

స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న అత్యంత విలువైన భూములను విక్రయించేందుకే ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోందని.. విశాఖ తెలుగుదేశం నేతలు అనుమానం వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతామన్నారు. రాష్ట్రానికి చిన్న నష్టం జరిగినా... దిల్లీ పెద్దల మెడలు వంచుతామన్న జగన్‌.. ఇప్పుడు ఏం చేస్తున్నారని.. ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రశ్నించారు.

ప్రైవేటీకరణకు బదులు..

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణకు బదులు.. ఐపీవోకు వెళ్లడం మంచిదని విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు కేంద్రానికి సూచించారు. అలా చేస్తే ప్లాంట్‌ విలువ కూడా పెరుగుతుందని చెప్పారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రజాహితం కాదని, నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని.. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ప్రధాని మోదీ, సీఎం జగన్‌కు లేఖ రాశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ..పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కేంద్రం నిర్ణయంపై నిరసన వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి:ఆయకట్టున్న ప్రాజెక్టులకే అధిక ప్రాధాన్యం

ABOUT THE AUTHOR

...view details