తెలంగాణ

telangana

ETV Bharat / city

'విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రాణ త్యాగాలకైనా సిద్ధం'

ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంపై.. ఉద్యమం ఊపందుకుంది. స్టీల్ కంపెనీని కాపాడుకునేందుకు ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని కార్మిక సంఘాలు ప్రకటించాయి. మరోవైపు.. రాజీనామా చేసైనా.. ఆంధ్రుల హక్కు పరిరక్షించుకుంటామని.. వైకాపా నేతలు ప్రకటించారు.

protest-on-vishaka-steel-plant
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కార్మికుల ఆందోళన

By

Published : Feb 10, 2021, 2:28 PM IST

ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఆందోళనకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పార్టీలకతీతంగా నేతలు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. బుధవారం ఉదయం స్టీల్‌ ప్లాంట్‌ ఎదుట కార్మికులు నిర్వహించిన 'విశాఖ ఉక్కు అఖిలపక్షాల సమావేశం'లో.. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, వైకాపా నేతలు పాల్గొన్నారు. వామపక్ష నేతలు నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కార్మికుల ఆందోళన

లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని.. కుట్రతో నష్టాల బాట పట్టించారని.. ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. స్టీల్ కంపెనీ ప్రైవేటీకరణ నిర్ణయానికి వైకాపా వ్యతిరేకమన్న విజయసాయి.. కేంద్ర నిర్ణయం అమలు కాకుండా అడ్డుకుని తీరుతామన్నారు. రాజీనామాలు, ప్రాణత్యాగాలు చేసైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటామని.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రకటించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కార్మికుల ఆందోళన

ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించకపోవడం.. నిరాశ కలిగించిందని కార్మిక సంఘాలు తెలిపాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. వైకాపా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని.. నిర్వాసితులు డిమాండ్ చేశారు. స్టీల్ కంపెనీని ప్రభుత్వమే నడపాలన్నారు. రాజకీయపార్టీలు, ప్రజలు ఏకమై ఆంధ్రుల హక్కును కాపాడుకోవాలని.. కార్మికసంఘాల నేతలు, నిర్వాసితులు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details