రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను పెంపుపై పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ మినహా మిగిలిన 12 నగరపాలక సంస్థలు, 128 పురపాలక సంఘాల్లో ఆస్తిపన్ను రూపంలో రూ.672 కోట్లు వసూలవుతోంది. వసూళ్లు పెంచుకునేందుకు పలు విధానాలను అనుసరించినా పెరుగుదల స్వల్పంగానే ఉంటోంది.
ఈ నేపథ్యంలో పురపాలక సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందేలా ప్రభుత్వం ఆస్తిపన్ను పెంపుపై దృష్టి సారించింది. ఎంత పెంచాలనే కోణంలో వివిధ ప్రాతిపదికలపై పురపాలకశాఖ అధ్యయనం చేస్తోంది. చాలా కాలంగా ఆస్తిపన్ను పెంచలేదని, పురపాలక సంఘాల కార్యకలాపాలు విస్తృతం కావడం వల్ల సొంత నిధుల సమీకరణకు ఆస్తిపన్ను కీలకమని ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
గ్రామ పంచాయతీల నుంచి కొత్తగా వర్గోన్నతి పొందిన 56 పురపాలక సంఘాల్లో మూడేళ్ల పాటు ఆస్తిపన్ను పెంపు ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పురపాలక సంఘాలు 2018 ఆగస్టులో ఏర్పాటయ్యాయి. వీటిలో వచ్చే ఏడాది ఆగస్టు లోపు ఆస్తిపన్ను పెరగదని సమాచారం. పూర్వపు పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో మాత్రం 12 లక్షలకు పైగా ఆస్తులు ఉన్నాయి.