Property tax assessment: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పాత ఆస్తి పన్ను అసెస్మెంట్ విధానం ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. తరచూ జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉండేవారు. సిబ్బంది కొరత మూలంగా అసెస్మెంట్ పక్రియ సకాలంలో పూర్తికాలేక ప్రజలు అవస్థలు పడేవారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు.. వంద శాతం అసెస్మెంట్ వేగవంతంగా పూర్తయ్యేందుకు.. ఆస్తులను టాక్స్నెట్ పరిధిలోకి తీసుకురావడం కోసం కొత్త ఆన్లైన్ ప్రక్రియను జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టింది. కొత్తగా ఇచ్చే నిర్మాణ అనుమతుల్లో వ్యక్తిగత గృహాల నుంచి భవన, వాణిజ్య సముదాయాలుంటాయి. నిర్మాణ దారులు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేస్తుంటారు.
ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయ్యాక.. ఆ పత్రాలను బల్దియా అధికారులకు ఇస్తే ఆస్తిపన్ను విధించేవారు. సిబ్బంది కొరతతో ఆస్తి అసెస్మెంట్ సెల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో వెళ్లి ఆస్తి మదింపునకు నెల నుంచి రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ ఐదేళ్ల కిందట స్వీయ మదింపు విధానాన్ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. యజమానులు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపలేదు. గ్రేటర్లో మొత్తం నిర్మాణాలు 17.5 లక్షలు... ఏటా ఇచ్చే నిర్మాణ అనుమతులు 16 వేలు వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టం, ధరణి విధానాలను బల్దియాకి వర్తింపజేసింది. చట్టసవరణ ద్వారా రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ జరిగేలా చేసింది. తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖ మరో అడుగు ముందుకేసి, కొత్తగా కొనే ఇళ్లకు.. రిజిస్ట్రేషన్‌తో పాటే ఆస్తిపన్ను ఖాతా సంఖ్యను ఇచ్చి, విస్తీర్ణానికి తగ్గట్లు పన్ను విధిస్తోంది. ఇందుకు సబ్రిజిస్ట్రార్లకు న్యూఅసెస్మెంట్ అనే ఐచ్ఛికాన్ని ఇచ్చింది. ఆ ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.