తెలంగాణ

telangana

ETV Bharat / city

FLOODS TO DAMS: నిండుకుండల్లా ప్రాజెక్టులు.. అలుగు పారుతున్న 18 వేల చెరువులు - నిండుకుండలా రాష్ట్రంలోని జలాశయాలు

ఏకధాటి వర్షాలతో పాటు... ఎగువ నుంచి ప్రవాహం తోడై... రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి భద్రాచలం వరకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. దాదాపుగా అన్ని జలాశయాలు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోవడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. వీటికి తోడుగా మంజీరాపై ప్రాజెక్టులతో హైదరాబాద్‌ జంట జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి.

FLOODS TO DAMS
FLOODS TO DAMS

By

Published : Sep 8, 2021, 4:19 AM IST

Updated : Sep 8, 2021, 6:29 AM IST

నిండుకుండల్లా ప్రాజెక్టులు.. అలుగు పారుతున్న 18 వేల చెరువులు

రాష్ట్రంలోని గోదావరి ప్రాజెక్టులు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకున్నాయి. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3లక్షల 50వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా... 33 గేట్లు ఎత్తి 3లక్షల 57వేల 500 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మధ్యమానేరుకు 36వేల 987 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా.... 69వేలకు పైగా క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దిగువ మానేరుకు 2లక్షల 15వేల 355 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 2లక్షల 62వేల 25క్యూసెక్కులను కిందికి పంపిస్తున్నారు.

  • నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 43,290 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 12,652 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటిమట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1403.82 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 17 టీఎంసీలుకు గాను ప్రస్తుతం 16.109 టీఎంసీలుగా ఉంది.
  • కడెం జలశయానికి 20వేల 27క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.... 18వేల 338క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో కొనసాగుతోంది. ఇప్పటికే నిండుకుండలా మారిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి ప్రవాహం పోటెత్తుతోంది. 5లక్షల 35వేల 501టీఎంసీల వరద వస్తుంటే... 5లక్షల 97వేల 251టీఎంసీలను దిగువకు వదులుతున్నారు.
  • గోదావరికి ప్రాణహితకు వరద తోడవడంతో... ధర్మపురి వద్ద నది ఉగ్రరూపం దాల్చుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని బ్యారేజీలకు వరద పోటెత్తుతోంది. తుపాకులగూడెం ప్రాజెక్టు వద్ద ప్రవాహ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో 34 అడుగుల నీటిమట్టం ఉంది. వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.

వెలవెలబోయిన ప్రాజెక్టులకు జలకళ..

మంజీరాలోనూ నీటిప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు వద్ద నీటి ఉద్ధృతి పెరిగింది. గతేడాది నీళ్లు లేక వెలవెలబోయిన ప్రాజెక్టులకు జలకళను సంతరించుకున్నాయి. సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 42వేల 511క్యూసెక్కులువస్తుండగా... అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్‌కు 27వేల 969 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంటే... 12వేల 652క్యూసెక్కులను కిందికి పంపిస్తున్నారు.

హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. హిమాయత్‌సాగర్‌లోకి 750 క్యూసెక్కులు వస్తుంటే... 2 గేట్ల ద్వారా మూసీలోకి 700 క్యూసెక్కులు వదిలిపెడుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌కు 1,200 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా... 4 గేట్ల ద్వారా 1800 క్యూసెక్కులను వదులుతున్నారు.

భారీ, మధ్య, చిన్నతరహా నీటి వనరులు జలకళ సంతరించుకున్నాయి. భారీ వర్షాలకు వరద వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుల గేట్లు బార్లా తెరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 18వేలకుపైగా చెరువులు మత్తడి పోస్తున్నాయి. 11,322 చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటున్నాయి. వరంగల్‌ సర్కిల్‌ పరిధిలో చెరువులు 2946 ఉండగా 2103 అలుగు పారుతున్నాయి. కరీంనగర్‌ పరిధిలో 2889 చెరువులకు 1675 నిండగా 862 నిండటానికి సిద్ధంగా ఉన్నాయి. ఖమ్మం పరిధిలో 1409కి 1210 పూర్తిస్థాయిలో ఉండగా 199 నిండటానికి చేరువయ్యాయి. నిజామాబాద్‌లో 968కి 470 నిండగా 475 చేరువయ్యాయి. ములుగు సర్కిల్లో 2295 చెరువులకు పూర్తి స్థాయిలో 1750, నిండడానికి 464 సిద్ధంగా ఉన్నాయి. గజ్వేల్‌ పరిధిలో 6308 చెరువులకు 3202 నిండగా 1343 ఒకటి రెండు రోజుల్లో అలుగు పోయనున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో దాదాపు అన్ని చెరువులు జలకళను సంతరించుకున్నాయి.

గేట్లు తెరచుకున్న మధ్యతరహా ప్రాజెక్టులు

రాష్ట్రంలో ఉన్న 36 మధ్యతరహా ప్రాజెక్టుల్లో 34 పూర్తిస్థాయిలో నిండాయి. ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో ఈ రిజర్వాయర్ల గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. మంజీర నది ఉద్ధృతంగా పారుతోంది. సింగూరు నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పెద్దవాగు జగన్నాథ్‌పూర్‌నకు 34 వేల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తం వదిలేస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు నుంచి 19280 క్యూసెక్కులు, ఆదిలాబాద్‌లోని మత్తడివాగు ప్రాజెక్టు నుంచి 5750, సిద్దిపేట జిల్లా శనిగరం ప్రాజెక్టు నుంచి 10815, భద్రాద్రి జిల్లాలో కిన్నెరసాని నుంచి 32 వేలు, తాలిపేరు నుంచి 29 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దుందుభి వాగు ద్వారా 2,900 క్యూసెక్కుల వరద రావడంతో మంగళవారం డిండి జలాశయం మత్తడి దూకింది. జలాశయం సామర్థ్యం 36 అడుగులు కాగా పూర్తిగా నిండడంతో సిల్ప్‌వే, మత్తడి గుండా 2,500 క్యూసెక్కుల వరకూ అలుగు పారుతోంది. సూర్యాపేట జిల్లా మూసీ నుంచి 10,842, ఖమ్మం జిల్లాలోని వైరా ప్రాజెక్టు నుంచి 13715 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

మూడోసారి నిండిన రిజర్వాయర్లు

జులై, ఆగస్టు నెలల్లోనే నిండిన ప్రధాన జలాశయాలు మూడోసారి పూర్తి స్థాయిలో నిండాయి. కృష్ణా పరీవాహకంలో జూరాలకు 93,565 క్యూసెక్కుల వరద వస్తుండగా గేట్లు, విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం 72 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 96,832 క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 14 వేలు, పులిచింతలకు 23,411 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువ మానేరు, మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాల గేట్లన్నీ తెరిచారు. కడెం నుంచి 42 వేలు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 5.08 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 5.39 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ఇవీ చూడండి:PROBLEMS WITH FLOODS: వాగులు పొంగుతున్నాయి.. ప్రాణాలను బలిగొంటున్నాయి!

Last Updated : Sep 8, 2021, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details