భాజపా, కాంగ్రెస్‌లతో తెజస సన్నిహితంగా ఉంటోందని దుష్ప్రచారం జరుగుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram) అన్నారు. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కోరారు. అమరుల ఆశయ సాధన కోసం.. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు తెజస పాటుపడుతుందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీయ అస్థిత్వాన్ని కోల్పోమని చెప్పారు.
నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లు..
ప్రజా సంఘాల నుంచి రాజకీయాల్లోకి వచ్చామని కోదండరాం(Kodandaram) అన్నారు. పార్టీ నిర్మాణ లోపాలు గుర్తించి బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, ఆఫీస్ బేరర్లతో అన్ని విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించి స్థానిక అంశాలపై పోరాడనున్నట్లు చెప్పారు. ఆగస్టు నెలాఖరు కల్లా ప్లీనరీ నిర్వహించి అన్ని నిర్ణయాలు ప్రకటిస్తామని వెల్లడించారు.
బోనాల శుభాకాంక్షలు..
రాష్ట్ర ప్రజలకు ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram).. ఆషాఢమాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. మొక్కులు చెల్లించుకోవాలని సూచించారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొనేటప్పుడు.. భౌతిక దూరం, మాస్కు ధరించడం, శానిటైజర్ రాసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. అమ్మవారు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని వేడుకున్నారు.
నీటి పంచాయతీపై నాటకం..
ఆస్తుల సంపాదనకు ఒక సాధనంగా ప్రభుత్వ తీరు మారిపోయింది. ఆస్తుల రక్షణకే గానీ.. ప్రజల రక్షణకు ప్రాధాన్యత లేదు. అధికార పార్టీ.. పైసలు కుమ్మరించి గెలవాలని తాపత్రయపడుతోంది. ఆంధ్రాలో ప్రాజెక్టులు కట్టుకోవటానికి అనుమతులు ఇచ్చి.. వారితో కుమ్మక్కై నీటి పంచాయతీలపై నాటకం ఆడుతున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే..50 రూపాయలకే ప్రజలకు పెట్రోల్ అందించవచ్చు. నిరుద్యోగ, పోడు సమస్యల పరిష్కారం, తదితర ప్రజా సమస్యలపై పోరాడతాం.
- ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram), తెజస అధ్యక్షుడు
అమరుల ఆశయ సాధనకు తెజస కృషి