‘‘కోట్ల ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ, పట్టా భూముల పర్యవేక్షణ, 39,600 మంది ఉద్యోగుల పరిపాలన, తహసీల్దారు నుంచి జిల్లా కలెక్టర్ల వరకు పరిపాలన వ్యవహారాలపై సమీక్ష.. ఇలా ఎన్నో కీలక విధులున్న భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) పోస్టు ఆరేళ్ల నుంచి ఇన్‌ఛార్జీలతోనే కొనసాగుతోంది. దీంతో పరిపాలనపై పరోక్షంగా ప్రభావం పడుతోంది. జిల్లాల్లో భూ సమస్యలు పేరుకుపోతున్నాయి. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టూ ఖాళీగానే ఉండగా.. ఐదేళ్ల నుంచి దీనిని అదనపు బాధ్యతలతో కొనసాగిస్తున్నారు. రెండేళ్ల నుంచి కీలకమైన ఈ రెండు పోస్టులను ప్రభుత్వం అదనపు బాధ్యతలతో సీఎస్‌కు అప్పగించింది.’’
రాష్ట్రంలో పాలన సులువుగా, సరళంగా ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో 2016లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి భిన్నంగా మండల స్థాయిలో ఉండే అధికారాలను తిరిగి జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన కీలక పోస్టులను అదనపు బాధ్యతలతో సరిపుచ్చుతోంది. దీంతో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. ప్రధానంగా భూములపై హక్కులు లేక మూడున్నర లక్షల మంది బాధితులు ఎదురుచూస్తున్నారు.
ముఖ్య సమస్యలు..
* 11.80 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది. రెండో విడత తీసుకున్న దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకోలేదు.
*2 లక్షల పోడు దరఖాస్తుల పరిష్కారానికి పరిశీలన చేయాలి.
*2.41 లక్షల ఎకరాల అటవీ-రెవెన్యూ సరిహద్దులను తేల్చాలి.
*జీవో 58, 59 కింద స్వీకరించిన 1.61 లక్షల దరఖాస్తుల్లో అర్హులను తేల్చి భూములను క్రమబద్ధీకరించాలి.
హక్కుల గందరగోళం వీడేదెప్పుడు?
రాష్ట్రంలో పాత పాసు పుస్తకాలను రద్దు చేసిన ప్రభుత్వం 2018 అనంతరం కొత్త పాసు పుస్తకాలు జారీ చేసింది. 61.31 లక్షల మందికి పంపిణీ చేసిన వాటిలో పెద్ద సంఖ్యలో తప్పులు దొర్లాయి. వీటితోపాటు దాదాపు మరో 7 కీలకమైన సమస్యలు (40 రకాలు) మంత్రివర్గ ఉప సంఘం గుర్తించినప్పటికీ.. ఏడు నెలలుగా చర్యలు శూన్యం. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ధరణి పోర్టల్ నడుస్తున్నప్పటికీ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించే వీలు లేకుండా పోయింది. ధరణిని కేవలం ఆదాయ కోణంలోనే రెవెన్యూశాఖ నడిపిస్తోందని, ప్రజల హక్కుల విషయాన్ని విస్మరిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యలపై హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నా.. పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు.
ఉద్యోగుల పరంగా..2020 అక్టోబరులో వీఆర్వో వ్యవస్థ రద్దు చేశారు. దీంతో విధుల్లేకుండాపోయిన 5,480 మందిని ఇప్పటికీ ఏ శాఖలో సర్దుబాటు చేయలేదు. ఈ 20 నెలల్లో చాలా మంది ప్రాణాలు విడిచారు. కారుణ్య నియామకం కింద వారి కుటుంబసభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించలేదు. ఇప్పటికీ వీఆర్వోలను ఏ శాఖలోకి తీసుకుంటారన్న స్పష్టత ఇవ్వకపోవడంతో వారు మానసికంగా కుంగిపోతున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
*గ్రామ రెవెన్యూ సహాయకులుగా 2019లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 500 మంది ప్రొబేషన్ పూర్తి చేసుకున్నారు. వీరితోపాటు డైరెక్ట్ రిక్రూటీలుగా ఎంపికై.. వీఆర్వోలుగా పదోన్నతి పొందిన 250 మందికి ప్రొబేషన్ ఇవ్వలేదు.
*2016 తరువాత తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించలేదు. 60 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయి. డీటీల నుంచి తహసీల్దార్లుగా 200 మందికి డీపీసీతో పదోన్నతులు కల్పించాల్సి ఉంది. 5 నెలల నుంచి పోస్టింగ్‌లు లేక 12 మంది తహసీల్దార్లు ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి..:
Amith shah at New CFSL: సైబర్ నేరాలే అతిపెద్ద సవాల్: అమిత్ షా