‘370 జీవో వల్ల కుటుంబానికి 250 కి.మీ.ల దూరంలో ఉండాల్సిరావడంతో మానసికంగా కుంగిపోతున్నాను. నా జీవిత భాగస్వామి బదిలీకి అవకాశం కల్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటా..’ అంటూ ఓ కానిస్టేబుల్ ఆవేదన మరిచిపోకముందే మరో మహిళా కానిస్టేబుల్ వాట్సప్‌లో పంపిన సందేశం పోలీస్‌శాఖలో కలకలం రేపుతోంది.
‘రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ గారికి నమస్కారం.. ఇటీవలే నేను రాజన్న సిరిసిల్ల నుంచి జగిత్యాలకు బదిలీ అయ్యాను. నా భర్త సిరిసిల్లలో 17వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ‘స్పౌజ్’ నిబంధనలు మాకు వర్తించడంలేదు. నా భర్త ఒక దగ్గర.. నేనొక దగ్గర పనిచేస్తున్నాం. మాకు మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. అతడిని చూసుకునేవారు ఎవరూలేక మూడు నెలల నుంచి నాతో పాటే విధులకు తీసుకొస్తున్నాను. బాబు ఆనారోగ్యానికి గురయ్యాడు. నాకు బతకాలనిలేదు. నేను నా బాబు చనిపోతాం’ అంటూ ఆవేదన వెలిబుచ్చడం సంచలనంగా మారింది.
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మంజుల ఏడుస్తూ వాట్సాప్‌లో పెట్టిన ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో ఆదివారం సదరు మహిళా కానిస్టేబుల్‌ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. పోలీసు శాఖలో ‘స్పౌజ్’ నిబంధనల వల్ల కలుగుతున్న వేదనకు ఇవి నిదర్శనాలు. భార్య ఓచోట.. భర్త మరోచోట విధులు నిర్వర్తించాల్సి రావడంతో దంపతులైన సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.