తెలంగాణ

telangana

ETV Bharat / city

బలిగొంటున్న ఆన్‌లైన్‌ బోధన! అర్థం కాక విద్యార్థుల్లో ఆందోళన - online classes suicide

కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు మూసి ఉంచిన నేపథ్యంలో.. పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ బోధనకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు కొనసాగుతున్నాయి. దీనివల్ల విద్యార్థికి తెలియకుండానే మానసిక ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆన్‌లైన్‌ బోధనతో ఆరోగ్య, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయనే ఆందోళన నెలకొనగా తాజాగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో కలవరానికి గురిచేస్తోంది.

online class
online class

By

Published : Aug 4, 2020, 6:27 AM IST

  • ఆన్‌లైన్‌లో బోధన అర్థం కావడం లేదని న్యూబోయిన్‌పల్లికి చెందిన ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వర్చువల్‌గా బోధిస్తున్న పాఠాలు అర్థం కాకపోవడంతో మానసిక ఒత్తిడికిలోనై భవిష్యత్తుపై బెంగతో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చదువు అర్థం కాకపోతే భవిష్యత్తులో చదువు కొనసాగించడం సాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పడుతుండటం ఆత్మహత్యకు పురిగొల్పింది.
  • గచ్చిబౌలిలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే బాలుడు ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు ట్యాబ్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని చెప్పి, మొబైల్‌లో వినాలని నచ్చజెప్పారు. ట్యాబ్‌ కొనివ్వకుంటే తరగతులు వినని చెప్పి ఇంట్లోని వేరొక గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే తల్లిదండ్రులు గుర్తించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది.

చిన్నప్పట్నుంచి విద్యార్థులు తరగతి గది బోధనకే అలవాటుపడ్డారు. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారేసరికి విద్యార్థులు ఆన్‌లైన్‌ బోధనతో ఇబ్బందిపడుతున్న పరిస్థితి. తరగతి గది బోధనకు, వర్చ్యువల్‌గా చూపించడానికి తేడా ఉండటం సమస్యగా మారుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పైగా తరగతి గదిలో చదివేటప్పుడు బ్లాక్‌బోర్డు మీద రాస్తుంటే చూసి రాసుకోవడానికి లేదా, అర్థం చేసుకునేందుకు అవకాశం ఎక్కువ. ప్రస్తుతం స్లైడ్స్‌ రూపంలో ఆన్‌లైన్‌లో చూపిస్తుండటంతో వాటిలోని ముఖ్యాంశాలు రాసుకోవడం ఇబ్బందిగా మారుతోందని విద్యార్థులు చెబుతున్నారు. కళాశాలలు, పాఠశాలలు లైవ్‌ బోధనకుతోడు ప్రీ రికార్డెడ్‌ వీడియోలు అందుబాటులో ఉంచాలని చెబుతున్నారు.

తల్లిదండ్రులూ.. అలా చేయొద్దు!

ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా మెదడుపై ఒత్తిడి పడి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని మనస్తత్వ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు ఇంటర్నెట్‌ లేదా మొబైల్‌ డేటా బ్యాండ్‌ విడ్త్‌ తక్కువగా ఉండటంతో తరగతులకు అవాంతరాలు రావడం, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు సరిగా వినకపోవడంతో విద్యార్థులు సహజంగానే ఆందోళనకు గురవుతున్నారు. వేరొక విద్యార్థికి అర్థమైన పాఠం.. తనకు అర్థం కాలేదన్న బెంగ ఎక్కువవుతోంది. దీనికితోడు ఇంట్లో ఉన్నప్పుడు పెద్దల ముందు సందేహాలు అడిగేందుకు పిల్లలు జంకుతుంటారు. ‘ఇంత చిన్న విషయం కూడా తెలియదా..?’ అని పెద్దలు అంటే ఇబ్బంది పడుతుంటారు. పిల్లలకు వచ్చిన సందేహాలు తీర్చుకునే వీల్లేకుండా పోతోంది.

ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి

ఆన్‌లైన్‌ తరగతుల విషయంలో అర్థం కావడం లేదనేకంటే ఇతర ప్రత్యామ్నాయాలు అన్వేషించి చదువు కొనసాగించవచ్ఛు వీలున్నంతవరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెప్పే పాఠాలు రికార్డు చేసుకునేందుకు ప్రయత్నించాలి. అర్థం కాని విషయాన్ని మరోసారి వినేందుకు వీలుంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు సంబంధిత పాఠ్యాంశానికి నోట్స్‌ రాసుకునేందుకు వీలవుతుంది. సొంతంగా పాఠ్యాంశాలపై పట్టు పెంచుకునేందుకు ఆన్‌లైన్‌లో ఎన్నో వీడియోలు అందుబాటులో ఉంన్నాయి. వాటిని చూసి పాఠాలు నేర్చుకోవాలి. రాత్రిళ్లు వీలైనంత ఎక్కువగా నిద్రపోతే వర్చువల్‌గా బోధనకు అవకాశం చిక్కుతుంది. ఒక క్లాస్‌కి మరో క్లాస్‌కీ మధ్య ఉన్న సమయంలో కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. దీనివల్ల కళ్లు, మెదడుపై స్క్రీన్‌ ద్వారా పడిన ఒత్తిడిని నుంచి ఉపశమనం పొందవచ్చు.

- డాక్టర్‌ అనిత ఆరె, మనస్తత్వ విశ్లేషకురాలు

ఇదీ చదవండి:కొత్త సచివాలయం ఎన్ని అంతస్తులో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details