తెలంగాణ

telangana

ETV Bharat / city

power sector Privatization : కేంద్ర సవరణ ప్రతిపాదనలన్నీ ప్రైవేటీకరణ దిశగానే

విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే(Privatization of the power sector) దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆ రంగ నిపుణులు, ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. సంపూర్ణంగా ప్రీ పెయిడ్‌ మీటర్ల ఏర్పాటు, లైసెన్సు లేకుండానే పంపిణీ రంగంలోకి విద్యుత్‌ ఏజెన్సీలు, గ్రామీణ కనెక్షన్లకే డిస్కంలను పరిమితం చేయడం వంటి కేంద్ర చర్యలు ప్రైవేటీకరణకు సంకేతాలుగా నిలుస్తున్నాయని చెబుతున్నారు.

కేంద్ర సవరణ ప్రతిపాదనలన్నీ ప్రైవేటీకరణ దిశగానే
కేంద్ర సవరణ ప్రతిపాదనలన్నీ ప్రైవేటీకరణ దిశగానే

By

Published : Jul 22, 2021, 9:08 AM IST

విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించే(Privatization of the power sector) దిశగా కేంద్రం అడుగులు వేస్తోందా? ఫ్రాంచైజీల పేరుతో ప్రైవేటు ఏజెన్సీలను పంపిణీలోకి దించుతోందా? లాభాలు తెచ్చిపెట్టే పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీ, పట్టణ ప్రాంతాల్లోని కనెక్షన్లను ఫ్రాంచైజీలకు అప్పగించనుందా? నష్టాలను మిగిల్చే గ్రామీణ ప్రాంతాలను మాత్రమే డిస్కంల చేతిలో ఉంచనుందా? ఇదే పంథాలో కేంద్రం తీసుకుంటున్న చర్యలన్నీ ప్రైవేటీకరణకు సంకేతాలుగా చెబుతున్నారు విద్యుత్‌ రంగ నిపుణులు, ఉద్యోగ సంఘాల నేతలు. దీనిపై ఆందోళనలకూ సిద్ధమవుతున్నారు. ‘విద్యుత్‌ ముసాయిదా సవరణ చట్టంలో ప్రతిపాదించిన అంశాలు, ప్రీ పెయిడ్‌ మీటర్ల (పీపీఎం) ఏర్పాటు ప్రక్రియ ఇందులో భాగమే’నని చెబుతున్నారు. కేంద్రం చెబుతున్న విద్యుత్తు సంస్కరణల సారమేంటి? విదేశాల్లో వీటి ప్రభావం ఎలా ఉంది? మన దేశంలో ఎలా అమలు చేయబోతున్నారో పరిశీలిస్తే...

ఇదీ కేంద్రం ప్యాకేజీ..

‘సంస్కరణల ఆధారిత- లక్ష్యాల సాధన’ పథకాన్ని ఇటీవల కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. విద్యుత్‌ పంపిణీ రంగాన్ని సంస్కరించాలన్నదే దీని లక్ష్యం. డిస్కంల నిర్వహణ సామర్థ్యం పెంచడం, ఆర్థిక స్థిరత్వం తెచ్చేందుకు అంటూ రూ.3,03,758 కోట్లతో రూపొందించిన ఈ పథకం 2025-26 వరకు అమల్లో ఉంటుంది.

ఎంబీఈడీ విధానం అందులో భాగమే

2022 నాటికి దేశంలో 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పాలన్నది కేంద్రం లక్ష్యం. ఇందుకు దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఒకే మార్కెట్‌ కిందకు తెచ్చేలా ‘మార్కెట్‌ బేస్డ్‌ ఎకనమిక్‌ డిస్పాచ్‌’ (ఎంబీఈడీ) విధానాన్ని 2022 ఏప్రిల్‌ నుంచి అమలు చేయనుంది. పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా చెబుతోంది. ఏడాదికి 1,393 బిలియన్‌ యూనిట్ల చౌక విద్యుత్‌ ద్వారా రూ.12,200 కోట్లు ఆదా అవుతాయని పేర్కొంటోంది. ఇవన్నీ పలు దేశాల్లో అమలవుతున్న విధానాలేనని నిపుణులు పేర్కొంటున్నారు.

కేంద్రం చేతుల్లోనే నియంత్రణ

విద్యుత్‌ రంగంపై అంతిమంగా కేంద్రం నిర్ణయాలకు లోబడే రాష్ట్రాలు వ్యవహరించాలి. ప్రతిపాదిత విద్యుత్‌ ముసాయిదా చట్టంలోని సవరణలు సంస్కరణల దిశగా విద్యుత్‌ రంగాన్ని నడిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ‘ముసాయిదా సవరణ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కేంద్రం తీసుకుంది. వాటి ఆధారంగా మార్పులు చేయవచ్చు. లేదంటే యథాతథంగా పార్లమెంటు ఆమోదానికి పంపొచ్చు. పార్లమెంటు ఆమోదించాక రాష్ట్రాలన్నీ అమలు చేయాల్సిందే. కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో పైకి వ్యతిరేకించినా.. అంతిమంగా అమలు చేయక తప్పద’ని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.

రెండింటికీ నష్టమే

ప్రతి విద్యుదుత్పత్తి సంస్థ కేంద్రం నిర్దేశించిన మేరకు కచ్చితంగా సౌర, పవన విద్యుత్తును కొనాలి. తమ దగ్గర అందుబాటులో లేకపోతే పక్క రాష్ట్రం నుంచైనా కొనాల్సిందే. దీనివల్ల రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గినప్పుడు, అవి థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తుంది. ఈ స్థితిలో ప్లాంటులో బొగ్గుకు తోడుగా చమురు కూడా వినియోగించాల్సి వస్తుంది. నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. విద్యుత్‌ను వాడినా, వాడకపోయినా డిస్కంలు జెన్‌కోలకు సొమ్ము చెల్లించాల్సిందే. దీనివల్ల అటు జెన్‌కో, ఇటు డిస్కం రెండూ నష్టపోతాయి.

పీపీఎంలతో పర్యవసానాలు

ప్రస్తుతం గృహ వినియోగదారులకు క్రాస్‌ సబ్సిడీ ఆధారంగా విద్యుత్‌ ఛార్జీలను నిర్ణయిస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీల చేతుల్లోకి పంపిణీ వ్యవస్థ వెళ్తే ఛార్జీల భారం పడవచ్చు.

విద్యుత్‌ ఛార్జీలను ముందుగా చెల్లించకపోతే క్షణాల్లో సరఫరా నిలిచిపోతుంది.

సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాలకు ప్రతి నెలా రీడింగ్‌ ఆధారంగా ప్రభుత్వం నగదు బదిలీ చేయాలి. అది ఆలస్యమైతే కరెంటు నిలిచిపోతుంది.

ప్రీపెయిడ్‌ మీటర్లతో పేదలకు ఇబ్బంది

ప్రీ పెయిడ్‌ మీటర్ల వల్ల జర్మనీలోని పేదలు, దారిద్య్ర రేఖకు దగ్గరగా ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారని ఫెడరల్‌ నెట్‌వర్క్‌ సంస్థ సర్వేలో తేల్చింది. అక్కడ బిల్లు చెల్లించని వారికి కరెంటు నిలిపేస్తున్న ఉదంతాలు పెరిగాయి. ప్రీపెయిడ్‌ మీటర్ల వల్ల విద్యుత్‌ పేదరికంతో ఇబ్బంది పడుతున్న గృహాల సంఖ్య పెరిగింది’ అని సర్వే చేసిన ఫెడరల్‌ నెట్‌వర్క్‌ ఏజెన్సీ అభిప్రాయపడింది. అమెరికాలో విద్యుత్‌ రంగ సంస్థలు ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటును 2011లోనే ప్రారంభించాయి. అక్కడ 492 విద్యుత్‌ కంపెనీలు 3.73 కోట్ల స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేశాయి. 2015 నాటికి వాటి సంఖ్య 6 కోట్లకు, 2018 నాటికి పది కోట్లకు చేరింది. ఇటలీ, బ్రిటన్‌, జర్మనీ, కెనడా దేశాలు పీపీఎంల ఏర్పాటును దాదాపు పూర్తిచేశాయి.

డిస్కంలకు లక్ష్యాలివి..

  • కేంద్ర సంస్కరణలు విద్యుత్‌ పంపిణీ రంగాన్ని పోటీ మార్కెట్‌ విధానంలోకి తీసుకెళ్లనున్నాయి. లైసెన్సు లేకుండానే వివిధ ఏజెన్సీలు విద్యుత్‌ పంపిణీ రంగంలోకి ప్రవేశించవచ్చు. సేవల ఆధారంగా ఏజెన్సీని వినియోగదారుడు ఎంపిక చేసుకోవచ్చు.
  • వినియోగదారులకు అందించే సేవలు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌, పంపిణీ, వాణిజ్య నష్టాల ఆధారంగా డిస్కంల పనితీరు అంచనా వేస్తారు. ఇందులో కనీసం 60 శాతం మార్కులను డిస్కంలు సాధించాలి.
  • వ్యవసాయ ఫీడర్లను సౌర విద్యుత్‌కు అనుసంధానించడం ద్వారా పగటివేళల్లో రైతులకు సరఫరా చేసేలా సదుపాయాలు అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకు రూ.20 వేల కోట్లతో 10 వేల ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలి.
  • దేశవ్యాప్తంగా 25 కోట్ల ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు అమర్చాల్సి ఉంటుంది. మొదటి దశలో 2023 డిసెంబరు నాటికి 10 కోట్ల మీటర్లను బిగించాలి. వీటిని ఫీడర్‌, పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గరే ఏర్పాటు చేయాలి.

డిస్కంల ఉనికికే ప్రమాదం

లాభాలను తెచ్చిపెట్టే సర్వీసులను ఫ్రాంచైజీలకు అప్పగించి, గ్రామీణ కనెక్షన్లను డిస్కంలకు వదిలేయటం వల్ల అవి మరింత నష్టాల్లో కూరుకుపోతాయి. క్రాస్‌ సబ్సిడీ అందించే పారిశ్రామిక, వాణిజ్య కనెక్షన్లను ఫ్రాంచైజీలకు అప్పగించటం వల్ల వచ్చే నష్టం వినియోగదారులపై పడకుండా ప్రభుత్వాలు ఎలా సర్దుబాటు చేస్తాయో స్పష్టత లేదు. పరోక్షంగా డిస్కంల పాత్రను తగ్గించే ప్రయత్నమిది. ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌, విద్యుత్‌ మరమ్మతులకు అదనపు ఛార్జీలను ఫ్రాంచైజీలు వసూలు చేసే అవకాశముంది.

- విద్యుత్‌ ఐకాస ఛైర్మన్‌ చంద్రశేఖర్‌, కన్వీనర్‌ సాయికృష్ణ

ఆదాయాన్నిచ్చే కనెక్షన్లపైనే ఫ్రాంచైజీల దృష్టి

కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలతో బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలుకు ఏజెన్సీలకు అవకాశాలు పెరుగుతాయి. అధిక ఆదాయాన్నిచ్చే పరిశ్రమలు, వాణిజ్య కనెక్షన్లను అవి ఆకర్షిస్తాయి. క్రాస్‌ సబ్సిడీ వచ్చే కనెక్షన్లు కోల్పోవటం వల్ల డిస్కంలపై భారం పెరుగుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించాలి. లేకుంటే ఛార్జీల పెంపు ద్వారా వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేసుకోక తప్పదు.

- ఎం.వేణుగోపాలరావు, కన్వీనర్‌, సెంటర్‌ ఫర్‌ పవర్‌ స్టడీస్‌

సంక్షోభం తలెత్తే ప్రమాదం

పంపిణీ సంస్థల డీలైసెన్సింగ్‌ విధానం విద్యుత్‌ రంగంలో సంక్షోభానికి కారణమవుతుంది. కొత్త పంపిణీ సంస్థలు వచ్చినప్పుడు సరఫరాకు కొత్త లైన్లు వేయవలసి వస్తుంది. దీని వల్ల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. ప్రస్తుతం అమలులో ఉన్న విద్యుత్‌ నియంత్రణ మండలిని పటిష్ఠం చేస్తే సరిపోతుంది. తప్పనిసరిగా పునరుత్పాదక ఇంధనాన్ని పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఉత్తరాది ప్రాజెక్టులకు మేలు చేయటానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.

- తిమ్మారెడ్డి, పీపుల్స్‌ మానిటరింగ్‌ గ్రూపు ఆన్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్‌, హైదరాబాద్‌

విద్యుత్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలి

విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ ఉద్దేశంతోనే కేంద్రం విద్యుత్‌ బిల్లును రూపొందించింది. ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయాల్సిందిపోయి ఇలాంటి చర్యలకు దిగటం దారుణం. ఇది రాష్ట్రాల హక్కులను హరించటమే. ఇకపై వినియోగదారులకు సబ్సిడీ వంటి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉండదు. ఒడిశా వంటి రాష్ట్రాల్లో గత 15 ఏళ్లుగా ప్రైవేటు విద్యుత్‌ పంపిణీ సంస్థలున్నా అవి లాభాలు ఆర్జించిన దాఖలాలు లేవు. ఇలాంటి అనుభవాలున్నా కేంద్రం ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపటం శోచనీయం. తక్షణం ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి.

- రత్నాకర్‌రావు, ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ జనరల్‌, తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details