తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: అడ్డగోలుగా ఛార్జీలు.. ఆందోళనలో జనాలు - corona effect on private transport

కరోనా ప్రభావం వల్ల ప్రజారవాణా నిలిచిపోయింది. ప్రజలంతా బస్సుల్లో వెళ్లేందుకు జంకుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఆటోలు, క్యాబుల్లో వెళదామనుకుంటే వారు ఆస్తులడుగుతున్నారని వాపోతున్నారు. ఛార్జీలు అమాంతం ఆకాశానికి పెంచేశారని అధికారులను అడిగితే కరోనా వేళ ప్రజారవాణాయే గగనం.. ఇక ఇతర సేవలా అని మండిపడుతున్నారని లబోదిబోమంటున్నారు.

private transport become expensive due to corona
అడ్డగోలుగా ఛార్జీలు.. ఆందోళనలో జనాలు

By

Published : Jul 30, 2020, 7:47 AM IST

విశాఖపట్నం నుంచి వచ్చే ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో ఉదయం 5.15 గంటలకు ఆగింది. దిగగానే ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. లగేజీ మోసే కూలీ ఒక్కో వస్తువుకు రూ.100 చొప్పున అడిగాడు. ఎందుకంత అంటే.. స్టేషన్‌ ఆవరణ దాటి ఆటో, క్యాబ్‌ వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు. బయటకు వచ్చాక సికింద్రాబాద్‌ నుంచి హైటెక్‌సిటీకి ఎంతని ప్రశ్నిస్తే టాక్సీవాలా రూ.700, ఆటోవాలా రూ.400 అని చెప్పారు. ఒక్కడినే కదా అని బైక్‌ వాలాని అడిగితే రూ.300 అవుతుందన్నాడు. ప్రీపెయిడ్‌ ఆటో వ్యవస్థ గురించి రైల్వే అధికారులను ఆరా తీయగా.. ‘‘కరోనా వేళ రైళ్లు నడపడమే గగనం.. ఇంకా మిగతా సేవలా? ఎవరి ప్రయాణ వనరు వారు చూసుకోవాల్సిందే’’ అని స్పష్టంచేశారు.

రైలు టిక్కెట్‌ కంటే ఎక్కువ

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు రైల్లో స్లీపర్‌క్లాస్‌ ఛార్జీ రూ.410. రైలు దిగాక క్యాబ్‌లో ఇంటికెళ్లడానికి రూ.250 నుంచి రూ.300 వరకూ తీసుకుంటున్నారు. స్లీపర్‌ క్లాస్‌లో వచ్చే కొందరికి క్యాబ్‌ బుక్‌ చేసుకోవడం రాక ఆటోలను, ట్యాక్సీలను సంప్రదిస్తే రైలు ఛార్జీ కంటే ఎక్కువ చెబుతుండడంతో లబోదిబోమంటున్నారు. బస్‌స్టేషన్లలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంటోంది.

నెలలుగా అవే అవస్థలు..

మే నెల మధ్యలో సికింద్రాబాద్‌ మీదుగా బెంగళూరు-దిల్లీ ప్రత్యేక రైలు సేవలు ప్రారంభమయ్యాయి. కొన్నాళ్లకు నేరుగా దిల్లీ-హైదరాబాద్‌ ప్రత్యేక రైలు వారంలో ఒక్కసారి ప్రారంభించారు. జూన్‌ 1 నుంచి మరో 9 ప్రత్యేక రైళ్లు చెన్నై, ముంబయి, విశాఖపట్నం, హౌరా తదితర పట్టణాలకు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఆటోలు, టాక్సీల విషయంలో ఈ దోపిడీ కొనసాగుతున్నా అరికట్టేవారు లేరు. ఉదయాన్నే పోలీసులు అందుబాటులో ఉండరు. రైల్వే, బస్‌స్టేషన్ల సిబ్బంది ఆ ప్రాంగణానికే పరిమితం. కరీంనగర్‌ నుంచి రూ.150తో నగరానికి వస్తే ఇక్కడ రూ.300 చెల్లిస్తే కాని ఇంటికి చేరలేని దుస్థితి నెలకొందని ఓ ప్రయాణికుడు వాపోయారు.

ప్రశ్నార్థకంగా ప్రజా రవాణా..

నగరంలో ప్రజా రవాణా నిలిచిపోయి 4 నెలలైంది. ఆర్టీసీ సిటీ బస్సులు లేకపోవడంతో నగరవాసుల కష్టాలు వర్ణనాతీతం. ఈ తరుణంలో రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్‌స్టేషన్లే అడ్డాలుగా ఆటోవాలాలు, ప్రైవేటు టాక్సీవాలాలు.. ఆఖరుకు ద్విచక్రవాహనంపై దించేవారు ప్రయాణికులను దోచుకుంటున్నారు. రైల్వేస్టేషన్లలో ప్రీపెయిడ్‌ విధానం ఉంటే కొంతవరకు ఊరటగా ఉండేది. కరోనా నేపథ్యంలో ధరలను స్థిరీకరించి ప్రీపెయిడ్‌ ఆటో విధానాన్ని తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details