ఓ ప్రైవేటు ఉపాధ్యాయుని ఆవేదన.. వినూత్న రీతిలో నిరసన Private Teacher Protest:కరోనా కారణంగా పాఠశాలలకు సెలవుల పొడిగింపును ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు తీవ్రంగా ఖండించాడు. కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులను పొడిగించింది. దీనిపై కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన నర్సింహులు అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ప్రధాన రహదారిపై చాక్‌పీస్‌తో.. వైన్‌షాపులో లేని కరోనా.. పర్మిట్ రూముల్లో లేని కరోనా.. సదస్సులకు లేని కరోనా.. బడిలోనే ఉందా..? సరస్వతి ఒడిలోనే ఉందా..? అంటూ రాసి తన ఆవేదన వెళ్లగక్కాడు. ఈ నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఉపాధ్యాయుని మాటల్లోని ఆవేదన.. నిజమే అని కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు మద్దతు తెలుపుతున్నారు.
ఆ ప్రైవేటు ఉపాధ్యాయుని మాటల్లోని ఆవేదన..
"సంక్రాంతి వరకు సెలవులిచ్చిన ప్రభుత్వం ఆపై వాటిని పొడిగించటాన్ని ఓ ప్రైవేటు ఉపాధ్యాయునిగా ఖండిస్తున్నాను. అయ్యా కేసీఆర్.. కరోనా వ్యాప్తి చెందుతుందంటున్నారు. బాగానే ఉంది. అయితే కేవలం బడిలోనే అది వ్యాప్తి చెందుతుందా..? వైన్‌షాపుల దగ్గర, పర్మిట్ రూమ్‌లలో, సినిమా హాళ్లలో, సదస్సుల్లో ఎలాంటి నిబంధనలు లేవ్వు కదా.. ఈ ప్రదేశాల్లో లేని కరోనా.. కేవలం బడిలోనే ఉందా..? సరస్వతి ఒడిలోనే ఉందా..? చెప్పాలి. ఇప్పటికైనా.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎం కేసీఆర్.. ఈ సెలవుల అంశంపై, విద్యార్థుల భవిష్యత్తుపై పునరాలోచించి వీలైనంత తొందరగా పాఠశాలలను పునఃప్రారంభించాలని ఓ ప్రైవేటు ఉపాధ్యాయునిగా నా విన్నపం."
- నర్సింహులు, ప్రైవేటు ఉపాధ్యాయుడు
ఇదీ చూడండి: