Private Practice Cancelled for New Doctors: రాష్ట్రంలో కొత్తగా నియమించబోయే వైద్యులకు సర్వీసు నిబంధనల్లో కీలక మార్పులు చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. నూతన వైద్యనియామకాల్లో ప్రైవేటు ప్రాక్టీసును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వైద్యసేవలు అందిస్తున్నారు. కొందరైతే ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వర్తించాల్సిన సమయాల్లోనూ సొంత ప్రాక్టీసు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మరికొందరు గంట, రెండు గంటలు మాత్రమే ప్రభుత్వాసుపత్రిలో ఉండి.. మధ్యాహ్నంలోపే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ ధోరణి ఉస్మానియా, గాంధీ తదితర బోధనాసుపత్రులు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల్లో కొందరు రెండు, మూడు రోజులకోసారి విధులకు హాజరవుతూ.. మిగిలిన సమయాన్ని సొంత ఆసుపత్రులకే కేటాయిస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యుల విషయంలో ఎటువంటి మార్పులు చేయకుండా.. కొత్తగా నియమితులయ్యే వైద్యులకు మాత్రం నిబంధనలు విధించాలని వైద్యశాఖ నిర్ణయించింది.
నిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదన్న నిబంధన ఉంది. దీన్నే ఇతర అన్ని ప్రభుత్వాసుపత్రుల వైద్యులకూ వర్తింపచేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కానీ ఈ షరతు విధిస్తే, ప్రభుత్వరంగంలో పనిచేయడానికి స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్టు వైద్యులు ముందుకొస్తారా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. వీటిని ముఖ్యమంత్రి ఆమోదించాక, కొత్త నియామక నోటిఫికేషన్ నిబంధనల్లో మార్పులు చేస్తారని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్లుగా వైద్యులే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇకపై వీరికి చికిత్సలపరమైన అంశాలను మాత్రమే అప్పగించి, వైద్యేతర అంశాల పర్యవేక్షణ బాధ్యతలను ఆర్డీవోలకు ఇవ్వాలని నిర్ణయించింది. వీరు జిల్లా ఆసుపత్రుల్లో పరిపాలనాధికారులుగా వ్యవహరిస్తారు. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణకు అప్పగించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.