తెలంగాణ

telangana

ETV Bharat / city

Hospital Charges For Covid Treatment : కాక్‌టెయిల్‌ పేరు చెప్పి ఆస్పత్రుల దోపిడీ - charges for corona treatment

Hospital Charges For Covid Treatment : రాష్ట్ర రాజధానిలో కరోనా కేసులు భారీగా వస్తుండడంతో చిన్నా చితకా ఆసుపత్రులు మళ్లీ వసూళ్లకు తెరతీశాయి. అవసరం ఉన్నా లేకపోయినా మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ డోసుతోపాటు, మూడు డోసుల రెమ్‌డెసివిర్‌ వేయాలంటూ దండుకుంటున్నాయి. పేరొందిన కొన్ని ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు బాధితుడి పరిస్థితి ఆధారంగా వీటిని సూచిస్తుండగా చిన్న ఆసుపత్రులు మాత్రం ఇదే అదనుగా భావిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

Hospital Charges For Covid Treatment
Hospital Charges For Covid Treatment

By

Published : Jan 21, 2022, 9:16 AM IST

Hospital Charges For Covid Treatment : హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో రోజూ 2 వేల వరకు కరోనా కేసులు నమోదవుతుండగా ఒక్క బల్దియా పరిధిలోనే 1500కు తక్కువ కాకుండా వస్తున్నాయి. ఇందులో డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్‌లు ఉంటున్నాయి. నమూనాలను జీనోమ్‌ స్వీకెన్సులో పరిశీలిస్తేనే ఏ వైరస్‌ అనేది స్పష్టమవుతుంది. ఇది ఖర్చుతో కూడినది కావడంతో ప్రభుత్వ స్థాయిలో చాలా తక్కువగానే చేస్తున్నారు. అందువల్ల ప్రస్తుత కేసుల్లో ఏ వైరస్‌ అన్నది తేలడం లేదు. పేరొందిన ఆసుపత్రుల్లో చేరిన బాధితుల పరిస్థితిని బట్టి రెమ్‌డెసివిర్‌, కాక్‌టెయిల్‌ మందుల్లో ఏది ఇవ్వాలన్నదానిపై వైద్య బృందం స్పష్టత ఇస్తుంది. ప్రస్తుతం చాలా వరకు ఒమిక్రాన్‌ కేసులే ఉండడం వల్ల ముందుగా రెమ్‌డెసివిర్‌ మూడు డోసులు చేస్తున్నారు. మరికొన్ని కాక్‌టెయిల్‌ చేసి తగ్గగానే ఇంటికి పంపిస్తున్నాయి. చిన్నా చితకా వైద్యశాలలు సాధారణ వైద్యాన్ని పక్కనపెట్టి సరికొత్త ప్రచారాన్ని మొదలుపెట్టాయి. కాక్‌టెయిల్‌ డోసు చేయించుకుంటే ఒక్క రోజులోనే కోలుకోవచ్చని వాట్సాప్‌లతోపాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాయి.

ప్రస్తుతం తీవ్రత తక్కువ ఉన్నా..

Hospital Charges For Corona Treatment : నగరంలో ఇప్పుడు వస్తున్న కరోనా కేసుల్లో 80 శాతం మంది తక్కువ లక్షణాలున్న వారే. ప్రభుత్వం ఇస్తున్న ఔషధాలను వాడుతూ హోం ఐసొలేషన్‌లోనే చాలామంది కోలుకుంటున్నారు. అయినా కొన్ని చిన్న ఆసుపత్రులు ముందుగా కాక్‌టెయిల్‌ డోసు ఇచ్చి లక్షణాలు తగ్గకపోతే ఆ తరువాత ఒకట్రెండు రోజులకు రెమ్‌డెసివిర్‌ డోసులు చేస్తున్నాయి. విచిత్రంగా యువతకు రెండింటినీ చేస్తుండడం గమనార్హం.

ఒక సీసా.. ఇద్దరికి ఉపయోగం

Corona Treatment Charges : ఒక సీసా మోనోక్లోనల్‌ యాంటీబాడీల కాక్‌టెయిల్‌ మందును ఇద్దరు బాధితులకు చేయొచ్ఛు సీసాకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకు వసూలు చేయాల్సి ఉండగా, చిన్న ఆస్పత్రులు ఒక్క డోసుకే రూ.లక్ష పైన బిల్లు వేస్తుండడం గమనార్హం.

గ్రేటర్‌లో 1645 మందికి పాజిటివ్‌

Corona Treatment Charges in Telangana : గ్రేటర్‌లో గడిచిన 24 గంటల్లో 1645 మంది కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. అంతకుముందు రోజు 1474 మందిలో వైరస్‌ నిర్ధారణ అయింది. మేడ్చల్‌ జిల్లాలో 380 మంది, రంగారెడ్డిలో 336 మందికి వైరస్‌ సోకింది.

నేటి నుంచి జ్వరం సర్వే

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం శుక్రవారం నుంచి ఇంటింటా జ్వరం సర్వేకు సిద్ధమైంది. దోమల నివారణ విభాగం, పట్టణ సామాజికాభివృద్ధి విభాగంలోని పొదుపు సంఘాల మహిళలు, ఇతర సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ నర్సులు సర్వేలో పాల్గొననున్నారు. 500 సమూహాలను ఏర్పాటు చేసి, ఒక్కో సమూహానికి రోజుకు కనీసం 60 ఇళ్లను పరిశీలించాలని లక్ష్యం నిర్దేశించారు. కొవిడ్‌ బాధితులకు వైద్య సలహాలు ఇవ్వడంతోపాటు, ఔషధ సంచిని అందజేసి, ఉపయోగించే విధానాన్ని నర్సులు వివరిస్తారు. బస్తీల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో తొలుత అక్కడే సర్వే చేయనున్నారు.

‘కింగ్‌కోఠి’ ఆసుపత్రిలో కొవిడ్‌ వార్డు

Corona Treatment Charges in Hyderabad : కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు ‘వైద్య విధాన పరిషత్‌(కింగ్‌కోఠి) జిల్లా ఆసుపత్రి’లో కొవిడ్‌ సేవల కోసం ప్రత్యేక వార్డులను సిద్ధం చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి సిబ్బంది వార్డులను శుభ్రంగా చేశారు. మరోవైపు వైద్య సిబ్బంది ఆయా వార్డుల పరిస్థితులను పరిశీలించి.. సమస్యలు ఏమైనా ఉంటే గుర్తించి పరిష్కరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాథ్‌, నోడల్‌ అధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌ స్వయంగా పరిస్థితులను పరిశీలించారు. ముఖ్యంగా కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలోని 350 పడకలు ఆక్సిజన్‌తో అనుసంధానమై ఉన్నవే. ఈ క్రమంలో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారికి అందించే ‘ఆక్సిజన్‌ ఫ్లోమీటర్లు’, ఐసీయు వార్డుల్లోని వెంటిలేటర్ల పనితీరునూ పరిశీలించారు. వ్యాధి తీవ్రంగా ఉన్నవారినే ఈ ఆసుపత్రిలో చేర్చుకోనున్నారు. వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు కింగ్‌కోఠిలో ప్రసూతి సేవలు, ప్రసవాలను గురువారం నుంచి నిలిపివేశారు.

బస్తీలపై కొవిడ్‌ పంజా!

13-17 శాతం మందిలో నిర్ధారణ

బస్తీలు, మురికివాడలపై కరోనా పంజా విసురుతోంది. 13-17 శాతం మందిలో కరోనా నిర్ధారణ అవుతోంది. నగరానికి చెందిన హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ జరిపిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. పాతబస్తీలో ఎక్కువ శాతం కేసులు వెలుగుచూస్తున్నాయి. హసన్‌నగర్‌, షహీన్‌నగర్‌, రాజేంద్రనగర్‌, ఎన్‌ఎస్‌కుంట పరిధిలోని పలు ప్రాంతాల్లో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే చేపట్టారు. మొత్తం 250 మందికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 17 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో 0-10 ఏళ్ల పిల్లలూ ఉన్నారు. చిన్నారులు 100-103 డిగ్రీల జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. పెద్దల్లో 99-101 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తలనొప్పి తదితర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది.

అందరికీ అవసరం లేదు

'బాధితుడి పరిస్థితిని బట్టి కాక్‌టెయిల్‌/రెమ్‌డెసివిర్‌ అవసరాన్ని నిర్ణయించాలి. సాధారణ లక్షణాలున్నా, భయంతో ఆసుపత్రిలో చేరిన అందరికీ ఇవ్వడం సబబు కాదు. సాధారణ మందులతో తగ్గే అవకాశం ఉన్నా, కొందరు యువత వీటి కోసం ఒత్తిడి చేస్తున్నారు.'

- డాక్టర్‌ సుజీత్‌, జనరల్‌ ఫిజీషియన్‌, అపోలో ఆస్ప్రతి కన్సల్‌టెంట్‌

ఇలా చేయొచ్ఛు..

ఒమిక్రాన్‌:రెమ్‌డెసివిర్‌ మూడు డోసులు.

డెల్టా: పాజిటివ్‌ వచ్చిన మొదటి అయిదు రోజుల్లో మోనోక్లోనల్‌ యాంటీబాడీల కాక్‌టెయిల్‌ ఒక డోసు. వృద్ధాప్యంతోపాటు మధుమేహం, ఇతరత్రా రోగాలుంటే: అవసరం మేరకు రెండింటిని వేర్వేరుగా ఇవ్వొచ్ఛు.

చార్మినార్‌ జోన్‌లో ఉద్ధృతం

కొవిడ్‌ వ్యాప్తి నగరంలో అంతకంతకు విస్తరిస్తోంది. రోజువారీగా నమోదయ్యే కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గల్లీలు, బస్తీలు, కాలనీల్లో పాజిటివ్‌ కేసులు విస్తరిస్తున్నాయి. అదేస్థాయిలో జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం సిబ్బంది ఇంటింటికీ తిరిగి క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 50వేల ఇళ్లలో సంబంధిత ద్రావణాన్ని చల్లారు. సగటున రోజుకు వెయ్యికి పైగా ఇళ్లలో మందు చల్లుతున్నట్లు బల్దియా వెల్లడించింది. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే.. చార్మినార్‌ జోన్‌ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. చాంద్రాయణగుట్ట సర్కిల్‌ పరిధిలో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందన్నారు. తర్వాతి స్థానంలో సికింద్రాబాద్‌ జోన్‌, కూకట్‌పల్లి సర్కిల్‌ ఉన్నాయి.

కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు, లక్షణాలున్న ఇళ్లలో క్రిమిసంహారక ద్రావణం పిచికారీ కోసం జీహెచ్‌ఎంసీని సంప్రదించాల్సిన నంబరు.. 040 2111 1111

ఇదీ చదవండి :Fever Survey: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details