ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం మేరకూ ముందుకు సాగడం లేదు. 2021 మార్చిలోపు ఆరు ప్రాజెక్టుల్నీ పూర్తి చేసి ప్రారంభించాలని రాష్ట్ర జలవనరుల శాఖ లక్ష్యం. ఏడాది నుంచి సమీక్షల్లో సీఎం జగన్ ఇదే చెబుతూ వచ్చారు. రూ.1,078 కోట్లు వెచ్చిస్తే వీటిని పూర్తి చేయవచ్చని, ఆయకట్టూ సాగులోకి వస్తుందని భావించి తొలుత వీటిపైనే దృష్టిపెట్టారు. సాంకేతిక, వాతావరణ అంశాల వల్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదని అధికారిక సమాచారం. ప్రాజెక్టుల పూర్తికి తాజా గడువుల్ని నిర్దేశించుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో సీఎం సమక్షంలో సాగిన సాగునీటి శాఖ సమీక్ష సమావేశం ఇందుకు వేదికైంది. ఆ ప్రకారం 2021 సెప్టెంబరు కల్లా ఆరు ప్రాజెక్టుల్నీ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్, వెలిగొండ టన్నెల్ 2 హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు వెలిగొండ మొదటి టన్నెల్ నుంచి నీరు ఇవ్వడం వంటి లక్ష్యాలు విధించుకున్నారు. దీంతో పాటు వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార రెండో భాగం రెండో దశ పనులు పూర్తి చేయాల్సి ఉంది.
రూ.24,092 కోట్లు కావాలి
వివిధ ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో చేపట్టిన 54 ప్రాజెక్టుల పూర్తికి రూ.24,092 కోట్లు కావాలని జలవనరుల శాఖ కిందటి ఏడాది లెక్కలు తేల్చింది. కొత్త ప్రభుత్వ హయాంలో వీటి ప్రాధాన్యాలు తేల్చి ఆ ప్రకారం 2024కి ఏ ప్రాజెక్టులు ఎలా పూర్తి చేయాలో విభజించారు. ప్రాధాన్యాల వారీగా మూడు విభాగాలు చేశారు. రూ.1,078 కోట్లు ఖర్చు చేస్తే చాలు... పూర్తయ్యే ఆరు ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. మూడు విభాగాల్లోకి రాని మరో 12 ప్రాజెక్టుల్ని ఇతర కేటగిరీల్లో చేర్చారు. వీటి పూర్తికి ఏడాదికి ఎన్ని నిధులు కావాలో పక్కా లెక్కలు వేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసిన క్రమంలో తొలి లక్ష్యాల్ని చేరేందుకు వివిధ కారణాల వల్ల ఆటంకం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. వెలిగొండ మొదటి టన్నెల్ తవ్వకం పనులే పూర్తయ్యాయి. మిగిలిన వాటికి కొత్త గడువును నిర్దేశించుకోవాల్సి వచ్చింది.
అవుకు టన్నెల్-2
టన్నెల్‌లో 160 మీటర్లకు పైగా ఫాల్తు జోన్ ఉంది. ఫాల్తు జోన్ లేని చోట కాంక్రీటు లైనింగు, టన్నెల్ తవ్వకం చేయాలి. అన్నీ కలిపి 16,310 క్యూబిక్ మీటర్ల మేర పని చేయాల్సి ఉండగా 11 వేల క్యూబిక్ మీటర్లకు పైగా పెండింగులోనే ఉంది. సాంకేతిక అంశాలకు సంబంధించి నిపుణుల సలహాల మేరకు ముందుకు వెళ్తున్నా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇంజినీర్లు చెబుతున్నారు.
వెలిగొండ మొదటి టన్నెల్ నుంచి నీళ్లు
వెలిగొండ మొదటి టన్నెల్ నుంచి తాజా లక్ష్యం మేరకు 2021 సెప్టెంబరులో నీళ్లు విడుదల చేయాలి. మొదటి టన్నెల్ తవ్వకం దాదాపు పూర్తయింది. రెండో టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు మొదలయ్యాయి. వేగం పుంజుకోవాల్సి ఉంది. హెడ్ రెగ్యులేటర్ పనులకు సంబంధించి ఆకృతులు ఖరారు కాలేదు. శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటి నిల్వ ప్రాంతానికి దిగువన గట్టును మరింత పటిష్ఠం చేసేందుకు 9 హెక్టార్లకు పైగా అటవీ భూమి వినియోగానికి అనుమతులు రావాలి. మొదటి టన్నెల్ దాదాపు పూర్తయినా రూ.140 కోట్ల విలువైన అనుబంధ పనులు కాలేదు. నీటి విడుదలకు వీలుగా ఫీడర్ కాలువ, తీగలేరు కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులు, టన్నెల్ లైనింగునూ కొంత మేర చేయాలి.