రాష్ట్రంలో క్షీణించిన అటవీ ప్రాంతాలన్నీ పునరుద్ధరించే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది పూర్తి చిత్తశుద్ధితో పనిచేయాలని అటవీ సంరక్షణ ప్రధానాధికారి శోభ తెలిపారు. అటవీ సర్కిళ్లు, అన్ని జిల్లాల అటవీఅధికారులతో రెండు రోజుల పాటు జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం అటవీ పునరుద్దరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని... సాచురేషన్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అటవీ బ్లాకుల్లో... క్షీణించిన అడవుల పునరుద్దరణ జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు. మొత్తం 32 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పునరుద్ధరణ లక్ష్యానికి గానూ ఇప్పటి వరకు రూ. 35కోట్లకు పైగా మొక్కలతో 8.65 లక్షల ఎకరాలు పూర్తి చేసినట్టు వివరించారు.
ఈ ఏడాది రెండు లక్షలకుపైగా ఎకరాల్లో పునరుద్ధరణ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు పీసీసీఎఫ్ వివరించారు. రానున్న నాలుగేళ్లలో పది లక్షలకుపైగా ఎకరాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. పునరుద్ధరణ చర్యల కింద అటవీ భూముల సరిహద్దుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు, కందకాల తవ్వకం ద్వారా రక్షణ కల్పించటం, సహజ పద్దతుల్లో అడవి పునరుద్దరణ జరిగేలా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. అడవుల్లోని ఖాళీ ప్రదేశాల్లో అయా ప్రాంతాలకు అనువైన మొక్కలనే నాటడం, రూట్ స్టాక్ సహజంగా పెరుగేందుకు వీలుగా అనువైన పద్దతులను అనుసరించినట్టు పేర్కొన్నారు.