President at vishakapatnam: ఏపీలోని విశాఖలో నేడు నిర్వహించనున్న రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష (పీఎఫ్‌ఆర్)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాయుసేన ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం, పలువురు మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఆదివారం విశాఖ చేరుకుని పీఎఫ్‌ఆర్ ఏర్పాట్లను పరిశీలించారు. నౌకాదళ అధికారులతో సమీక్షించారు. ముంబయి, కొచ్చి, అండమాన్-నికోబార్ నుంచి యుద్ధనౌకలు విశాఖకు వచ్చాయి. యుద్ధనౌకల నుంచి రాష్ట్రపతికి గౌరవ వందనానికి నావికులు సాధన చేశారు.
విశాఖ సాగరతీరంలో ఆదివారం నిర్వహించిన నమూనా ఫ్లైపాస్ట్ విన్యాసాలతో ఒళ్లు గగుర్పొడిచాయి. యుద్ధ విమానాలు వాయువేగంతో ప్రయాణించినప్పుడు వచ్చిన భారీ శబ్దాలతో ఆకాశం హోరెత్తింది. పీఎఫ్‌ఆర్‌లో పాల్గొనే యుద్ధనౌకలను సాగర తీరానికి చేరువగా ఉంచడంతో వాటిని చూసేందుకు బీచ్ పరిసరాలకు భారీగా జనం తరలివచ్చారు. ఈ నెల 27న నావల్ కోస్టల్ బ్యాటరీ నుంచి వైఎంసీఏ వరకు జరిగే ‘అంతర్జాతీయ నగర కవాతు’కు అధికారులు భారీ ఎత్తున సుందరీకరణ కార్యక్రమాలు చేపడుతున్నారు.