Presidential Fleet Review: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా సాగిన 'ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ' కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. నౌకలు, జలాంతర్గాములు, హెలికాప్టర్లు, విమానాల సన్నద్ధత బాగుందని ప్రశంసించారు. అన్నింటినీ దగ్గరగా పరిశీలించడం చాలా ఆనందంగా ఉందన్న ఆయన.. ఈ పరేడ్ ద్వారా నౌకాదళ శక్తిని మరోసారి చాటిచెప్పారని పేర్కొన్నారు.
విశాఖలో తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరాన్ని వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారని రాష్ట్రపతి గుర్తు చేశారు. కరోనా వేళ దేశ నౌకాదళ పాత్ర అద్వితీయమని కొనియాడారు. నౌకాదళం.. మేకిన్ ఇండియా కార్యక్రమంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. పీఎఫ్‌ఆర్‌లో పాల్గొన్న 70 శాతం నౌకలు, జలాంతర్గాములు ఇక్కడే తయారు చేశారని వెల్లడించారు. దేశీయ తయారీ విక్రాంత్, న్యూక్లియర్ సబ్ మెరైన్లు దేశానికి గర్వకారణమని వెల్లడించారు.