తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, చిరంజీవి, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. యావత్ దేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగువారి సొంతమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు... దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా... అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోవింద్ ఆకాంక్షించారు.
ఘనమైన చరిత్ర, సహజవనరులతో భినత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింభిస్తున్న తెలంగాణ... వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తోందనని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ దిశగా మరింత సమృద్ధిని సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ అవతర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎన్నో రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు. దేశ ప్రగతిలో తెలంగాణ ముఖ్య భూమిక పోషిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతి, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.