కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గిందని అనుకుంటున్న వేళ ఏపీలో వైరస్ మరోసారి తిరగబెట్టింది. పలు జిల్లాల్లో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరిగుతూ వస్తున్నాయి. దీంతో ముందుగా చెప్పినట్లుగానే తిరిగి లాక్ డౌన్‌కు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలోని మూడు జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో పాక్షికంగా ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. కృష్ణా జిల్లాలో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నారు. అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో లాక్ డౌన్ అమల్లో ఉండగా... శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
ప్రకాశంలో ప్రస్తుత పరిస్థితి
ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అంతకుమందుకు మూడు నుంచి ఐదు కేసులు నమోదు అయ్యేవి. కానీ ప్రస్తుతం 20 నుంచి 30 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా 340 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఒక్క ఒంగోలులోనే ఇంతవరకూ 83 కేసులు ఉన్నాయి. చీరాలలో 48 పాజిటివ్ కేసులు, వేటపాలెంలో 16 కేసులు, కందుకూరులో 22 కేసులు, టంగుటూరు మండలంలో 14 కనిగిరిలో 9, మార్కాపురంలో 10, గుడ్లూరులో12 కేసులు ఉన్నాయి. ఒంగోలు, చీరాల, మార్కాపురం పట్టణాల్లో ఆదివారం నుంచి 14 రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు.. ఉదయం 10 గంటల వరకు కూరగాయలు, పాలు వంటి నిత్యవసరాల కోసం దుకాణాలు తెరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 47 కంటైన్‌మెంట్లు జోన్లుగా విభజించి ఎక్కువ కంటైన్మెంట్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు.
'వ్యాపారంగా అస్తవ్యస్తంగా మారింది. దుకాణాలు తెరిచి 20 రోజులు పాటు కాకముందే మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారు. కొంత గాడిలో పడుతున్నామన్న వేళ ఇలాంటి నిర్ణయం ప్రకటించటం సరికాదు. మరోసారి ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లక తప్పేలా లేదు'
- వ్యాపారులు
అనంతలో ఆగని కరోనా
అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ జడలు విప్పుతోంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1,234 మందికి సోకింది. గతం వారం రోజులుగా కేసుల నమోదు ఎక్కువగా ఉంది. కేసులు ఎక్కవగా నమోదవుతున్న పలు ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ విధించారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఈనెల 21 నుంచి ఆంక్షలు పెట్టారు. ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు వరకు మాత్రమే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసిందని ఆనందపడిన చిన్న వ్యాపారులు, దుకాణ దారులకు మళ్లీ లాక్ డౌన్ విధించటం పిడుగుపాటుగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.