చదివితే ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ (ఐఐఎం)లోనే చదవాలన్నది ప్రేరణ బైద్ చిన్ననాటి కల. కానీ దాన్ని సాకారం చేసుకోవడానికి రెండున్నర దశాబ్దాలు పట్టిందామెకు. పెళ్లైన తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యతలతోనే కాలం గడిచిపోయినా... ఆ భర్త, పిల్లల సహకారంతోనే తిరిగి ఐఐఎమ్‌లో అడుగుపెట్టానంటారామె. ‘నా స్వస్థలం రాజస్థాన్. జేెఈఈ రాయడం కోసం మూడేళ్లు కష్టపడ్డాను. వ్యక్తిగత కారణాల వల్ల ఆ పరీక్షలు రాయలేకపోయాను. బీబీఎమ్ డిగ్రీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంతలో పెళ్లి కావడంతో వైజాగ్ వచ్చేశా. మా వారు స్థాపించిన ఏసీఎన్ ఇన్ఫోటెక్‌లో డైరెక్టర్‌గా పాలుపంచుకున్నా. దానికోసం మూడేళ్లు పనిచేశా. తర్వాత ఇద్దరు అబ్బాయిలు... వాళ్ల పెంపకం, అత్తమామల బాగోగులు.. ఇంటి పనుల్లో పడి చదువుకోవాలన్న నా కల వాయిదా పడుతూ వచ్చింది. ఎంత పని ఉన్నా నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. బహుశా నా కలని ముందుకు నడిపించింది ఆ అలవాటేనేమో’ అని చెప్పుకొచ్చారు ప్రేరణ.
44 ఏళ్ల వయసులో తరగతిలో అడుగుపెట్టి... యువతరంతో పోటీపడుతూ మొదటి ర్యాంకు తెచ్చుకోవడం మాటలు కాదు. కానీ సాధించాలనే తపన ఉంటే వయసు ఆటంకం కాదంటారు ప్రేరణ. ‘మా పెద్దబ్బాయి అమెరికాలో ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతున్నాడు.. రెండో వాడు ఇంటర్ రెండో సంవత్సరం. 2018లో మా పెదబాబు కోసం కాలేజీలు తిరుగుతున్నప్పుడే నాకో విషయం తెలిసింది. ఐఐఎమ్ వైజాగ్... ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ని నిర్వహిస్తోందని. అది తెలిశాక చాలా సంతోషంగా అనిపించింది. టాప్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలన్న నా కలని నెరవేర్చుకోవాలని అనుకున్నాను.