నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. ఇక్కడ ఖనిజాన్వేషణకు అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) సిద్ధమవుతోంది. అమ్రాబాద్ పులుల అభయారణ్యం ప్రాంతంలో సర్వే, ఖనిజాన్వేషణకు సంబంధించి తెలంగాణ అటవీశాఖకు ప్రతిపాదనలు పంపింది. యురేనియం నిల్వల పరిమాణం, నాణ్యత తెలుసుకునేందుకు దాదాపు 21,000 ఎకరాల అటవీ ప్రాంతంలో సర్వేకు అనుమతివ్వాలని కోరింది. రెండు అటవీ ప్రాంతాల్లో 4,000 వరకు బోర్లు వేస్తామని పేర్కొంది.
అడవుల్లోకి వెళ్లేందుకు.. నమూనాల సేకరణకు బోర్ల రూపంలో జరిపే తవ్వకాల కోసం భారీ యంత్రాలు, వాహనాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది.
భూమిలో పెద్దపెద్ద బోర్లు...
ఏఎండీ భూగర్భం నుంచి యురేనియం నిక్షేపాల నమూనాల సేకరణ కోసం దాదాపు 75 సెం.మీ. చుట్టుకొలత ఉండే భారీ బోర్లు వేయనున్నట్లు సమాచారం. యురేనియం అన్వేషణపై ఏఎండీకి మే 22న సూత్రప్రాయ ఆమోదం తెలిపిన కేంద్ర అటవీ సలహా మండలి.. తెలంగాణ అటవీశాఖకు వివరాలు సమర్పించాలని స్పష్టంచేసింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రాంతీయ డైరెక్టర్ జులై 1న ఆ సమాచారం అప్‌లోడ్ చేశారు. అందులో పూర్తి వివరాలు లేకపోవడంతో.. అప్పటి తెలంగాణ ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) ప్రశాంత్‌కుమార్ ఝా జులై 4న ఏఎండీ ప్రాంతీయ డైరెక్టర్‌కు లేఖ రాశారు. తవ్వకాలు జరపాలనుకుంటున్న ప్రాంతాల మ్యాప్‌లు, వివరాలు ఇవ్వాలని కోరారు.
అటవీశాఖ కోరిన వివరాలివి
- అమ్రాబాద్ అభయారణ్యంలో ఏయే ప్రాంతాల్లో యురేనియం కోసం అన్వేషణ చేస్తారు? ఎన్నిచోట్ల బోర్లు వేస్తారు?
- ఎన్ని వాహనాలు, యంత్రాల్ని అడవిలోకి తీసుకెళ్తారు? సర్వేకు ఎంతమంది సిబ్బందిని తీసుకెళ్తారు?
- అడవిలో ఎన్నిరోజులు ఉంటారు? అక్కడికి వెళ్లడానికి రహదారులు చూసుకున్నారా?
- ప్రశాంత్‌కుమార్ ఝా లేఖకు స్పందిస్తూ ఏఎండీ రెండురోజుల క్రితం పూర్తివివరాలతో తాజా ప్రతిపాదనల్ని అటవీశాఖకు పంపింది.