Preparation Strategy for History: రాష్ట్రంలో త్వరలో రానున్న ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘చరిత్ర అంటే తేదీలు, యుద్ధాలు, అవి జరిగిన ప్రాంతాలు...రాజుల పేర్లు, కట్టడాలు...ఇలా ఎన్నిటినో గుర్తుంచుకోవాలని అధిక శాతం మంది అభ్యర్థులు భయపడుతుంటారు. వాస్తవానికి చరిత్ర తెలుసుకోవడం అంటే అది కాదు’ అంటున్నారు చరిత్ర నిపుణుడు, ఓయూ విశ్రాంత ఆచార్యుడు, టీఎస్‌పీఎస్సీ సిలబస్ సంస్కరణల కమిటీ సభ్యుడు ఆచార్య అడపా సత్యనారాయణ. తెలంగాణ చరిత్రపై విస్తృత అధ్యయనం చేసిన ఆయన ‘తెలంగాణ చరిత్ర-సంస్కృతి’, ‘రాష్ట్ర అవతరణ ఉద్యమాలు’ ‘తెలంగాణ చరిత్ర- నూతన కోణం’ అనే పుస్తకాలు రచించారు. అభ్యర్థులు సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్ని పుస్తకాలు అయినా చదవండి...సొంతంగా నోట్స్ రాసుకుంటే పోటీ పరీక్షల్లో ఎంతో ప్రయోజనం పొందుతారని ఆయన సూచిస్తున్నారు. గ్రూపు-1 నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో చరిత్ర సిలబస్, దాని సన్నద్ధత, అభ్యర్థులు చేసే తప్పులు...విజయం సాధించాలంటే మెలకువలు తదితర ఎన్నో అంశాలపై ఆయన ‘ఈనాడు’కు ఇచ్చిన ముఖాముఖిలో వివరించారు.
పోటీ పరీక్షల్లో ‘చరిత్ర’ ప్రాధాన్యమెంత..
గ్రూపు పరీక్షల నుంచి సివిల్ సర్వీసెస్ వరకు చరిత్ర సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుంది. గ్రూపు-1లో అయితే రెండో పేపర్‌గా చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ ఉంది. ఆరో పేపర్ తెలంగాణ ఉద్యమం. రాష్ట్ర ఆవిర్భావంలో కూడా 1948 నుంచి తెలంగాణ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక జనరల్ ఎస్సేలో చరిత్ర కోణంలో భారత చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని చదవాలి. ఇక ప్రిలిమినరీలో కూడా చరిత్ర ప్రశ్నలుంటాయి. చరిత్రపై అవగాహన ఉంటే ఇప్పటి పరిస్థితులు కూడా లోతుగా అర్థమవుతాయి.
చరిత్ర అంటే పేర్లు.. సంవత్సరాలు గుర్తుంచుకోవాలన్న భయం అభ్యర్థుల్లో ఉంది? దీనిపై మీరేమంటారు..
చాలా మందిలో ఈ అభిప్రాయం ఉన్న మాట వాస్తవం. అందుకే టీఎస్‌పీఎస్సీ సిలబస్‌లో వాటి కంటే చరిత్రలో వివిధ రాజుల కాలంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, పరిపాలన తదితర అంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చాం. తెలంగాణ చరిత్రలో భాగంగా శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌షాహీలు తదితర రాజుల గురించి చదవాలి. ఏ రాజుల కాలంలో వ్యవసాయం ఎలా ఉంది? నీటి పారుదల, నిర్మించిన కట్టడాలు, యుద్ధాలు, రాజధానులు, ముఖ్యమైన ఘట్టాలు, సంవత్సరాలు తదితర అంశాలపై ఒక పట్టికను రూపొందించుకుంటే అయోమయానికి గురయ్యే అవకాశం ఉండదు.