తెలంగాణ

telangana

ETV Bharat / city

భర్తతో గొడవపడి.. నిండు గర్భిణీ 65 కి.మీ. నడక.. చివరకు..! - pregnant woman problems

Pregnant walked 65 Kms: అమ్మతనం ప్రతి మహిళ కోరుకునే వరం.. జీవితంలో ఎన్ని కష్టాలు పడినా పిల్లల కోసం పరితపిస్తుంటారు.. దాంపత్య జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా.. గొడవలు ఉన్నా మహిళ తల్లి కాబోతుందంటే అవన్నీ తొలగిపోతాయి.. ప్రతి భార్యను భర్త అపురూపంగా చూసుకుంటాడు. కానీ ఓ మహిళ విషయంలో అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. భర్తతో గొడవ పడి నిండు గర్భిణి దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఎటుపోవాలో తెలియక.. కనిపించిన దారిని వెతుక్కుంటూ వెళ్లింది. చివరకు 65 కి.మీలు నడిచిన తర్వాత.. పురిటి నొప్పులతో రోడ్డుపై పడ్డ ఆమెను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

భర్తతో గొడవపడి.. నిండు గర్భిణీ 65 కి.మీ. నడక.. చివరకు..!
భర్తతో గొడవపడి.. నిండు గర్భిణీ 65 కి.మీ. నడక.. చివరకు..!

By

Published : May 15, 2022, 2:21 PM IST

వర్షిణి నిండు గర్భిణి.. ఆమె కళ్లు ఏకధారగా వర్షిస్తూనే ఉన్నాయి.. అడుగు తీసి అడుగు ముందుకు వేయాలంటే నిస్సత్తువ.. అయినా కాళ్లు ముందుకు సాగుతూనే ఉన్నాయి. ఓపక్క తన బాగోగులు చూడకుండా నిత్యం గొడవ పెట్టుకునే భర్తపై గొంతు దాకా కోపం.. మరోపక్క గర్భంలోని శిశువుపై గుండె నిండుగా ప్రేమ.. బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలనే తపన.. అలా అలా 65 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లింది.. ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతిలో బయలుదేరి నాయుడుపేట చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నాయుడుపేట ఆర్టీసీ బస్టాండు దగ్గరకు వెళ్లేసరికి వర్షిణికి నొప్పులు మొదలయ్యాయి. ఏం చేయాలో తెలియదు.. ఎటు వెళ్లాలో అర్థం కాదు... అయిన వారెవరూ అండగా లేని పరిస్థితి.. రోడ్డుపైనే నిల్చుండిపోయింది. తనకు ఎవరైనా సాయం చేయాలంటూ వచ్చి పోయే వాహనాలను ఆపింది. ఎవరూ ఆగలేదు.. ఆమెను పట్టించుకోలేదు. అందరూ ఎవరిదారిన వారు వెళ్తుండగా ఓ యువకుడు మాత్రం స్పందించారు. వర్షిణి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. సిబ్బంది కిరణ్‌కుమార్‌, చిరంజీవి అక్కడకు చేరుకుని ఆమెను వాహనంలోకి ఎక్కించారు.

బిడ్డ కిందకు జారిపోతోందని చెప్పడంతో వారు వెంటనే ప్రసవం చేశారు. వర్షిణిని చూసి సిబ్బందికి కడుపు తరుక్కుపోయింది. తమ ఇళ్ల నుంచి దుస్తులు తెప్పించి తల్లికి, బిడ్డకు ఇచ్చారు. రెండు రోజులుగా సరైన తిండి లేక నీరసంగా ఉన్న ఆమె చేత పాలు, రొట్టె తినిపించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. పుట్టిన ఆడ శిశువు బరువు తక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు పంపించారు. తన పేరు కొత్తూరు వర్షిణి అని.. తనది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వైఎస్సార్‌ నగర్‌ అని, భర్తతో కలిసి కూలీపనుల కోసం తిరుపతి వచ్చినట్లు ఆమె చెప్పారు. భర్తతో గొడవలతో విసుగు చెంది చేతిలో చిల్లిగవ్వ లేక.. రెండు రోజుల కిందట తిరుపతిలో బయలుదేరి మధ్యమధ్యలో ఊళ్లలో ఆగుతూ కాలినడకన నాయుడుపేట వచ్చినట్లు పేర్కొన్నారు. భర్త పేరు, తల్లిదండ్రుల వివరాలు చెప్పేందుకు నిరాకరించడంతో వైద్య సిబ్బంది దిశ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details