తెలంగాణ

telangana

ETV Bharat / city

మీ పిల్లలకు డెంగీ జ్వరమా, ఆందోళన అసలే వద్దు - వైరల్ జ్వరాలు

Dengue Fever Precautions దోమకాటు ప్రమాదకరంగా మారుతోంది. ఫలితంగా రాష్ట్రంలో డెంగీ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. చినుకుజాడతో దోమల బెడద, దాంతో పాటే డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా, వైరల్‌ జ్వరాలు ప్రబలుతాయి. ఈ జబ్బులు పిల్లలకు తొందరగా వ్యాపిస్తాయి. పిల్లలకు వచ్చే జ్వరాలతో ఆందోళన చెందకుండా ఈ జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా డెంగీ రాకుండా అప్రమత్తంగా ఉండండి.

DENGUE
DENGUE

By

Published : Aug 19, 2022, 6:36 AM IST

Dengue Fever Precautions : వాతావరణంలో మార్పులు, వర్షాలతో దోమలు పెరుగుతాయి. వాటితో పాటు చికెన్‌గున్యా, మలేరియా, డెంగీ, వైరల్‌ జ్వరాలు ప్రబలుతాయి. ఈ జబ్బులు పిల్లలకు తొందరగా వ్యాపిస్తాయి. ఇలాంటి సమయంలో వైద్యుల దగ్గరికి వెళ్తే జ్వరాలను అదుపులోకి తెచ్చే అవకాశాలుంటాయి. పిల్లలకు వచ్చే జ్వరాలతో ఆందోళన చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సిద్ధం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచినీటిలో పెరిగే దోమలతోనే డెంగీ జ్వరాలు రానున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులుండవని ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ పి.వి.రామారావు తెలిపారు.

లక్షణాలు ఎలా ఉంటాయి..ఇది జ్వరంతో మొదలవుతుంది. నాలుగైదు రోజులుంటుంది. ఒళ్లునొప్పులుంటాయి. తల, కండరాలు, కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి. కొంతమందికి వాంతులు, కడుపునొప్పి కూడా ఉంటుంది. కొందరికి చర్మంపై ఎర్రదద్దుర్లు వస్తాయి. ఈ లక్షణాలు డెంగీ, వైరల్‌ జ్వరాల్లోనూ ఉంటాయి. సాధారణ జ్వరానికి, డెంగీ జ్వరానికి మధ్య స్వల్ప తేడాలుంటాయి. డెంగీ జ్వరం వస్తే ఎర్రదద్దుర్లు చర్మంపై వస్తాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. చలితో జ్వరం వస్తే మలేరియాగా అనుమానించాలి. నీరు, ఆహారం కలుషితం అయితే టైఫాయిడ్‌ వస్తుంది. వాంతులు, విరేచనాలతో జ్వరం ఎక్కువ రోజులుంటుంది.

డెంగీ ప్రమాదకరమా..డెంగీ జ్వరం రాగానే ప్రమాదకరంగా మారదు. కొంతమందికి సీరియస్‌ అవుతుంది. ఇది కూడా చికిత్స సరిగా అందకుండా జాప్యం చేయడంతో పల్స్‌ పడిపోతుంది. నీరసం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స చేయాల్సి వస్తుంది. జ్వరం వచ్చిన కొద్దిరోజుల్లో యాంటీజెన్‌ పరీక్ష చేస్తే డెంగీ అవునో కాదో తేలిపోతుంది. కొన్నిసార్లు ఎలీసా పరీక్ష కూడా చేయాల్సి వస్తుంది.

చికిత్స ఎలా ఉంటుంది..దాదాపు 80 శాతం మంది పిల్లలకు సాధారణ మందులతోనే సరిపోతుంది. పారాసిటమాల్‌ వేయడంతో పాటు పండ్లు, ఆహారం, నీరు, పాలు ఎక్కువగా ఇవ్వాలి. మంచి పౌష్టికాహారంతో తొందరగా కోలుకుంటారు. ప్లేట్‌లెట్లు బాగా తగ్గినపుడు ఆసుపత్రిలో చికిత్స చేయాల్సి ఉంటుంది. 20వేల కంటే తక్కువగా ప్లేట్‌లెట్లు ఉన్నపుడు మాత్రమే వాటిని ఎక్కించుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details