Pre Ugadi Event At Raj Bhavan: రాజ్‌భవన్‌లో ఇవాళ సాయంత్రం జరగనున్న ఉగాది ముందస్తు వేడుకలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రేపట్నుంచి ప్రారంభమవుతున్న శుభకృత్ నామ తెలుగు సంవత్సరం సందర్భంగా ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముందస్తు వేడుకలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల అధినేతలు, ప్రముఖులకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం పంపారు. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉగాది వేడులకు ఎవరెవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు కేసీఆర్ వెళ్తారా? - Ugadi celebrations 2022
Pre Ugadi Event At Raj Bhavan : ముందస్తు ఉగాది వేడుకలకు రాజ్‌భవన్ వేదిక కానుంది. గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌లో జరగనున్న ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ అధినేతలు, ఇతర ప్రముఖులకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం అందింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరెవరూ ఈ ఉత్సవాలకు వస్తారోననే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గత కొన్నాళ్లుగా రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో వేడుకలకు సీఎం సహా ఎవరూ హాజరు కాలేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల సమ్మక్క - సారలమ్మ జాతర, హన్మకొండ జిల్లాల పర్యటనల సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరూ గవర్నర్‌కు స్వాగతం పలకలేదు. అయితే తన నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేవని, కొత్త సంవత్సరం నుంచి అనుబంధాలు వికసించాలని ఆశిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై... ఇటీవల వ్యాఖ్యానించారు. వీటన్నింటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌లో జరగనున్న ఉగాది వేడుకలకు సీఎం, మంత్రులు, ఇతరులు ఎవరెవరు హాజరవుతారన్నది ఆసక్తి రేపుతోంది.