తెలంగాణ

telangana

ETV Bharat / city

పేరుకే ఉన్నట్టు.. అంతా కనికట్టు.. వాణిజ్య నిర్మాణాల పేరిట 'ప్రీలాంచ్‌ దందా' - రియల్​ ఎస్టేట్​ హైదరాబాద్

హైదరాబాద్​లో ప్రీలాంచ్​ విక్రయాల పేరుతో జరుగుతున్న మోసాలు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రాఫిక్స్‌ హంగులు, అద్ది రంగురంగుల బ్రోచర్లను చూసి వలలో పడిన చాలా మంది రూ.కోట్లల్లో నష్టపోతున్నారు. భూమి, అనుమతులు లేకుండా, రెరాలో రిజిస్టర్‌ కాని వెంచర్లలో కొని మోసపోవద్దని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు.

ప్రీలాంచ్​ బిజినెస్
ప్రీలాంచ్​ బిజినెస్

By

Published : Aug 8, 2022, 5:29 AM IST

గచ్చిబౌలి చుట్టుపక్కల కొన్నాళ్లుగా 'వాణిజ్య ప్రీలాంచ్‌ దందా'కు తెరలేచింది. ఎంతో డిమాండ్‌ ఉండే ఇలాంటి ప్రాంతంలోనే చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయలేక ఒక పెద్ద సంస్థ చేతులెత్తేసింది. రాయదుర్గంలో ఒక వాణిజ్య భవనంలో ఎంతో ముందుగానే అడ్వాన్స్‌లు చెల్లించి రెండు అంతస్తులు కొంటే.. పూర్తిచేసి ఇవ్వడంలో జాప్యంతో కొనుగోలుదారులు నష్టపోయారు. నిర్మాణదారు జైలుకెళ్లడంతో అందులో కొన్నవారు తీవ్రంగా దెబ్బతిన్నారు.

ఆ సంస్థల పేరిట గజం భూమి అయినా ఉండదు.. చేతిలో రూపాయి కూడా కనిపించదు. కానీ, వాణిజ్య భవనాలంటూ 'ప్రీలాంచ్‌ విక్రయాల' పేరిట గాలిలో అద్భుతమైన మేడలు కడతున్నాయి. గ్రాఫిక్స్‌ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లు ముద్రించి రకరకాల మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. నెలనెలా రూ.వేలల్లో కిరాయి చెల్లిస్తామంటూ ఇటీవల కొన్ని సంస్థలు మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. ఈ వలకు చిక్కుతున్న అమాయకులు ఎప్పుడో కడతామనే నిర్మాణానికి ఇప్పుడే రూ.లక్షలు చెల్లించి, లబోదిబో అంటున్నారు. ఇప్పటికే గృహ నిర్మాణంలో ప్రీలాంచ్‌ విక్రయాల పేరిట జరిగిన దందాలో మోసపోయామని కొనుగోలుదారులు ఓ పక్క పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. సొమ్ము వెనక్కివ్వాలని ఆయా సంస్థల ముందు ధర్నాలు చేస్తున్నారు.. ఇంకోపక్క మరికొన్ని సంస్థలు మాల్స్‌లో 'కమర్షియల్‌ స్పేస్‌' అంటూ యథేచ్ఛగా దందాకు తెర తీశాయి. సెంటు భూమి అయినా లేకుండానే రూ.కోట్లు కొల్లగొట్టేలా పక్కా వ్యూహం పన్నాయి. 'ఆకర్షణీయ వడ్డీ' పేరుతో దగా చేస్తున్నాయి. వీటి ప్రచార సరళి, విచ్చలవిడి వ్యాపార సంస్కృతిపై నిర్మాణ సంస్థలు ఫిర్యాదులు చేస్తున్నా.. కట్టడి చేయాల్సిన రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ అథారిటీ(రెరా) స్తబ్దంగా ఉండిపోవడంతో కొనుగోలుదారులు నష్టపోతున్నారు.

భూమి లేకుండానే..

  • నగరానికి చెందిన ఒక సంస్థ విమానాశ్రయానికి చేరువలో ప్రపంచస్థాయి షాపింగ్‌ మాల్‌ నిర్మిస్తున్నామని.. ఇందులో పెట్టుబడి పెడితే మంచి రాబడి అందుకుంటారని ప్రచారం చేస్తోంది. రెండు టవర్లలో 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్‌ వస్తుందని.. ఇందులో వాణిజ్య స్థలం ఒక యూనిట్‌ అంటే 120 చ.అ. విస్తీర్ణాన్ని రూ.10లక్షలకు కొంటే.. కొన్నప్పటి నుంచి నిర్మాణం పూర్తయ్యేవరకు ప్రతినెలా రూ.5వేలు ఇస్తామంటోది. నిర్మాణం పూర్తయ్యాక రూ.18వేలు అద్దె రాబడి వస్తుందని నమ్మించే యత్నం చేస్తోంది. సంస్థ మోసపూరిత ప్రకటనపై ఫిర్యాదులు వస్తుండటంతో ప్రాజెక్టు గురించి ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. వీరు మాల్‌ కడతామని చెబుతున్న ప్రాంతంలో అసలు వీరి పేరున సెంటు భూమి కూడా లేదని తేలింది. కొంటామని భూయాజమానులతో మాట్లాడారంతే.. కానీ, అప్పుడే మాల్‌ ఎలా గొప్పగా ఉండబోతుందో గ్రాఫిక్స్‌ డిజైన్‌ చేసి.. ఏజెంట్లను నియమించుకుని కొనుగోలుదారులతో సొమ్ములు కట్టించుకుంటున్నారు. భూమి కొనేందుకే సొమ్ములు లేని సంస్థ, రెరా నిబంధనలకు విరుద్ధంగా ప్రీలాంచింగ్‌ చేస్తూ వేలమందికి ప్రతినెలా సొమ్ములు ఎలా చెల్లిస్తుందో కొనుగోలుదారులు ఆలోచించాలని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు హితవు పలుకుతున్నారు.
  • విమానాశ్రయానికి చేరువలోనే మరో సంస్థ సైతం అతిపెద్ద మాల్‌ రాబోతుందని.. అనుమతులు లేకుండా వాణిజ్య స్థలాలను ప్రీలాంచ్‌లో విక్రయిస్తోంది. కట్టడి చేయాల్సిన సంస్థలు చోద్యం చూస్తున్నాయి.
  • వాణిజ్య స్థలమైనా, నివాస గృహమైనా నిబంధనల మేరకు నడుచుకునే సంస్థల్లో కొనడం ద్వారా పెట్టిన పెట్టుబడికి రక్షణ ఉంటుంది. అన్ని అనుమతులు లభించి, రెరాలో నమోదైతే కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్ములో 70శాతం వరకు ఎస్క్రో ఖాతాలో జమ చేస్తారు. పైగా అనుమతులు వచ్చాయంటే అప్పటికే వారి వద్ద భూమి, స్పష్టమైన ప్లాన్‌ ఉంటుంది. అదే ప్రీలాంచ్‌లో కల్లబొల్లి కబుర్లు చెప్తారు.. కాగితాలపైనే మేడలు కడతారు. వీరి చేతిలో భూమి, నిర్మాణానికి సొమ్ములు ఏమీ ఉండవు. అంతా కొనుగోలుదారుల నుంచే రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో వెలుగుచూసిన ఒక ఇన్‌ఫ్రా సంస్థ ఉదంతమే ఇందుకు నిదర్శం.

భూమి, అనుమతులు లేకుండా, రెరాలో రిజిస్టర్‌ కాని వెంచర్లలో కొని మోసపోవద్దు..అంటూ క్రెడాయ్‌ తరఫున కొనుగోలుదారులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. అత్యాశకు పోయి వారు ఇరకాటంలో పడుతున్నారు. భూమే లేని సంస్థ ప్రతినెలా అద్దె ఎక్కడి నుంచి చెల్లిస్తుంది? నిర్మాణం పూర్తయితే కదా కిరాయిలు వచ్చేది. మొక్క నాటి, పెరిగి కాయలు కాస్తే కోసుకోగలం. అసలు మొక్కే నాటలేదు.. కాయలు కోసి ఇస్తాను అంటే ఎలా సాధ్యం? దీనిపై కొనుగోలుదారులు ఆలోచించాలి. రెరా ఉన్నా పూర్తిస్థాయి ఛైర్మన్‌ లేక మన రాష్ట్రంలో చురుగ్గా పనిచేయడం లేదు. ఇక ముందైనా ఇలాంటి దందాలు జరగకుండా ప్రభుత్వం మేల్కొనాలి. గట్టి చర్యలు చేపట్టాలి.

-పి.రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

ఇదీ చూడండి:kcr congratulates nikhat zareen: నిఖత్ జరీన్​కు కేసీఆర్ అభినందనలు..

ABOUT THE AUTHOR

...view details