PK Survey on TRS: ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది..? పథకాలు బాగున్నాయా..? సర్కారుపై ఏదైనా అసంతృప్తి ఉందా..? ముఖ్యమంత్రి కేసీఆర్పై ఎలాంటి అభిప్రాయం ఉంది..? స్థానిక ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు..? ఇలాంటి పలు అంశాలపై ప్రశాంత్ కిషోర్ బృందం సర్వేలు నిర్వహించింది. ఐప్యాక్ బృందం నివేదికలను గులాబీ పార్టీ నాయకత్వం లోతుగా విశ్లేషిస్తోంది. నివేదికలు చాలా వరకు సంతృప్తిగానే ఉన్నప్పటికీ.. కొన్ని విషయాలపై అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్పై రాష్ట్రమంతటా ఒకేలా సంతృప్తిగా, పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నట్లు పీకే బృందం పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో మళ్లీ తెరాస సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని నివేదికల్లో వివరించింది. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని.. భాజపా హడావిడి పెరిగినప్పటికీ విజయానికి చాలా దూరంలో మూడో స్థానంలో ఉంటుందని పీకే బృందం సర్వేల్లో తెలిపింది.
సంతృప్తికరం..: ప్రభుత్వ పథకాలపై మరికొన్ని సర్వేలు నిర్వహించి నివేదికలు సమర్పించింది. సాగునీరు, తాగునీరు, విద్యుత్, అభివృద్ధి పనుల పట్ల మెజార్టీ ప్రజల్లో సంతృప్తి వ్యక్తమైన్నట్లు నివేదికల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రైతుబంధు వంటి పథకాలపై ప్రజలు సర్వే బృందాల వద్ద సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉద్యోగ నోటిఫికేషన్లు యువతలో అసంతృప్తి, నిరాశను చాలా వరకు తగ్గించాయని.. ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలన్నీ సంపూర్ణంగా అమలు చేస్తే చాలనే అభిప్రాయాన్ని నివేదికల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కొంత అసంతృప్తి..: కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంపై చాలా ప్రాంతాల్లో ప్రజలు నిరాశ వ్యక్తం చేసినట్లు పీకే బృందం నివేదించినట్లు తెలుస్తోంది. అదే విధంగా రెండు పడకల ఇళ్లు ఇవ్వడం లేదన్న ఆవేదన కూడా ప్రజల్లో ఉందని సర్వేల్లో పేర్కొన్నట్లు సమాచారం. ధరణిలో లోపాలు కూడా ప్రజలను కొంత ఇబ్బంది పెడుతున్నట్లు పీకే బృందం అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల పనితీరు..: తెరాస ఎమ్మెల్యేలు, నేతల పనితీరుపై కూడా సర్వేలు చేసి నివేదికలు సమర్పించారు. కేసీఆర్, తెరాసపై మెజార్టీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. మళ్లీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్న ప్రశాంత్ కిషోర్ సర్వేలు.. కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల తీరుపై ప్రజల్లో అసంతృప్తిని ఎత్తిచూపినట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ అసహనం కలిగిస్తోందని హెచ్చరించారు. పలు నియోజకవర్గాల్లో నేతలు గ్రూపులుగా ఏర్పడి.. బహిరంగంగా విమర్శించుకుంటున్నారని.. దీన్ని కట్టడి చేయాలని సూచించినట్లు సమాచారం. జాతీయ పార్టీ ఏర్పాటు, వివిధ రాష్ట్రాల్లో ప్రజల డిమాండ్లు, ఆకాంక్షలు తదితర అంశాలపై కూడా మరికొన్ని నివేదికలు సమర్పించింది.
అసంతృప్తి పొగొట్టేలా..: ప్రశాంక్ కిషోర్ బృందం సర్వేలపై తెరాస నాయకత్వం లోతుగా విశ్లేషిస్తోంది. ఇతర మార్గాల్లోనూ అందిన సమాచారంతో పోల్చి.. తుది అభిప్రాయానికి వస్తున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులు, పించన్లు, డబల్ బెడ్ రూం ఇళ్లపై అసంతృప్తిని తొలగించేందుకు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. త్వరలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు పడకల గదుల ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు... సొంత స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించేలా కసరత్తు వేగం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ధరణి లోపాలను కూడా పరిష్కరించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.
ఆ నేతలపై ఫోకస్..: మరోవైపు పార్టీ పరిస్థితులను చక్కదిద్దేందుకు నడుం బిగించారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్గాలుగా విడిపోయిన నేతలతో ఇటీవల కేటీఆర్ భేటీ అయ్యారు. పర్యటనకు వెళ్లిన ప్రతీ జిల్లాలో అక్కడి నేతలతో సమావేశం కానున్నారు. సర్దిచెప్పిన తర్వాత కూడా వినకుండా హద్దు మీరే కొందరు నేతలపై అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది. సర్వేల్లో అసంతృప్తి వ్యక్తమైన ఎమ్మెల్యేలపై ప్రత్యేక దృష్టి సారించారు. హెచ్చరించి అప్రమత్తం చేసినా మార్పు రాకపోతే.. మరో నేతకు టికెట్ ఇవ్వాలన్న దిశగా పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జిలను నియమించాలని భావిస్తున్నారు. త్వరలోనే తెరాస విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై ముఖ్యమంత్రి, కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఇవీ చూడండి: